ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ-టిడిపి అధినేతలకు సొంత కంచుకోటలు ఉన్నాయి. జగన్‌కు పులివెందుల..చంద్రబాబుకు కుప్పం సీట్లు ఉన్నాయి. వాటిల్లో వారికి తిరుగులేదు. ప్రత్యర్ధులు ఎంత రాజకీయం చేసిన పులివెందులలో జగన్ గెలుపుని, కుప్పంలో చంద్రబాబు గెలుపుని ఆపడం కష్టమే. అలా జనసేన అధినేత పవన్‌కు మాత్రం ఒక కంచుకోట లేదు. పైగా పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఆయన ఓటమి పాలైన విషయం తెలిసిందే.
తొలిసారి రెండు సీట్లలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గాజువాక, భీమవరం సీట్లలో పోటీ చేసి ఓడిపోయారు. అలా ఓడిపోవడంపై వైసీపీ నేతలు ఎగతాళి చేస్తూ వస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే అలా ఎగతాళి చేస్తున్నా సరే ఇప్పటికీ పవన్‌కు ఒక సీటు ఫిక్స్ కాలేదు. నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన ఎక్కడ పోటీ చేస్తారో క్లారిటీ లేదు. ఒకోసారో ఒకో సీటు లో పోటీ చేస్తారని కథనాలు మాత్రం వస్తున్నాయి. తిరుపతి, పిఠాపురం కాకినాడ, గాజువాక, భీమిలి, నరసాపురం, భీమవరం..అబ్బో ఇలా ఒకటి ఏంటి..ఇంకా పలు స్థానాల్లో పవన్ పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం మాత్రం జరుగుతుంది. కానీ క్లారిటీగా ఎక్కడ పోటీ చేస్తారో మాత్రం చెప్పలేదు.
అయితే పవన్ మాత్రం స్ట్రాంగ్ గా ఒకటే ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఎక్కడైతే ఓడిపోయారో..అక్కడే పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో ఉన్నారట. అందులో ఎలాంటి మార్పు లేదట. టిడిపితో పొత్తు ఉన్నా , లేకపోయినా ఖచ్చితంగా భీమవరం స్థానంలోనే పోటీ చేసి గెలిచి తీరాలని భావిస్తున్నారట. అంటే ఈ సారి ఒక్కచోటే పోటీకి దిగాలని అది కూడా భీమవరంలోనే పోటీ చేయాలని చూస్తున్నారట.
ఇప్పటికే అక్కడ పార్టీ వర్గాలకు కూడా అంతర్గతంగా సమాచారం కూడా ఇచ్చారట. ఈ మేరకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారట. ఈ సారి భీమవరంలో పవన్ బరిలో దిగితే విజయం సాధించడం గ్యారెంటీ అని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.