జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ అడుగులు ఎటు…? ఈ ప్రశ్నకు ఆయన మినహా ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. రాజకీయంగా జనసేన అనేది ఇంకా బలం లేని పార్టీనే. ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం పవన్ కళ్యాణ్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో, అభిమానుల్లో, ఆ పార్టీకి ఓటు వేసిన వాళ్లలో ధైర్యం నింపే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇటీవల ఆయన విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ సూపర్ హిట్ అయిందనే భావన ఆ పార్టీలో ఉంది. ఇక ఇప్పుడు పవన్ ఏం చేస్తారు…? పవన్ ఏ విధంగా ముందుకి వెళ్తారు…?
ఎన్నికల ఫలితాలు వచ్చిన వారం తర్వాత అనుకుంట… ఒక సమావేశం నిర్వహించి… జగన్ పై అమరావతి విషయంలో మోడీకి, అమిత్ షా కు ఫిర్యాదు చేస్తాను అని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవానికి కేంద్రానికి ఫిర్యాదు చేస్తాను అని వ్యాఖ్యానించాల్సింది. ఈ వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆయన బీజేపీ ని సమర్ధిస్తూ చేసిన వ్యాఖ్యలు చూసిన వాళ్లకు ఒకటి అర్ధమవుతుంది. పవన్ జనసేన ను బీజేపీ లో విలీనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని… ప్రస్తుతం పవన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన ఎందుకు అనేది చాలా మంది నుంచి వినపడుతున్న ప్రశ్న.
దీని వెనుక ఒక బలమైన కారణం ఉందనేది కొందరి మాట. అది ఏంటి అనేది ఒకసారి చూస్తే… ఆయన ప్రస్తుతం జనసేన విలీనానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జెపి నడ్డా తో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారని… ఇటీవల విశాఖలో జరిగిన లాంగ్ మార్చ్ విజయవంతం అయినా విషయాన్ని కూడా వారికి వివరించే ప్రయత్నం పవన్ చేస్తారని అంటున్నారు. ప్రధానితో కలిసినా కలవకపోయినా అమిత్ షా, నడ్డాను పవన్ కలుస్తారని, ఆయన తిరిగి ఆంధ్రప్రదేశ్ రాగానే పరిస్థితుల్లో మార్పు వస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై కూడా ఆయన ఫిర్యాదు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కార్మికుల ఆత్మహత్యలు సహా… అమరావతి విషయంలో ప్రభుత్వ నిర్ణయం, ఇసుక దోపిడీ వంటి వాటిని వివరించడానికి వెళ్లారట.