ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌ 6 పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకం.. వాహనదారుల జేబులు గుల్ల..!

-

దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి బీఎస్‌ 6 వాహనాలను వాహన తయారీ కంపెనీలు విక్రయించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వాహన ఖరీదును బట్టి ప్రస్తుతం ఉన్న వాహనాల ధర రూ.5వేల నుంచి రూ.15వేల వరకు పెరగనుంది. అయితే కాలుష్యాన్ని తగ్గించేందుకు బీఎస్‌ 6 వాహనాల వాడకం తప్పనిసరి అయినా.. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీని ప్రకటించలేదు. దీంతో పెరిగిన ధరల మొత్తాన్ని వాహనదారులు భరించాల్సి వస్తోంది. అయితే ఇదే కాదు.. ఇకపై పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వాహనదారుల జేబులు గుల్ల కానున్నాయి.

ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి దేశంలోని దాదాపు అన్ని చమురు సంస్థలు బీఎస్‌ 6 ప్రమాణాలు ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ను విక్రయించనున్నాయి. ఈ మేరకు ఆయా చమురు సంస్థలు ఇప్పటికే తమ రిఫైనరీలకు మార్పులు, చేర్పులు చేశాయి. అందుకు గాను ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సంస్థే ఏకంగా రూ.17వేల కోట్లను ఖర్చు చేయగా, మొత్తం చమురు సంస్థలు దాదాపుగా రూ.35వేల కోట్లను ఖర్చు చేశాయి. ఈ క్రమంలో ఆయా సంస్థలు బీఎస్‌ 6 ప్రమాణాలు ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ను ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి తమ తమ పెట్రోల్‌ పంపుల్లో విక్రయించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ పరిమాణాల కారణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత పెరగనున్నాయి.

బీఎస్‌ 6 ప్రమాణాలు కలిగిన పెట్రోల్‌, డీజిల్‌ను చమురు సంస్థలు విక్రయించనుండడంతో వాటి ధరలు కూడా పెరుగుతాయని ఆ కంపెనీలు ఇప్పటికే వెల్లడించాయి. ఈ క్రమంలో వాహనదారులకు వాహనం కొనేందుకు అయ్యే ఖర్చుతోపాటు అందులో నింపుకునే ఇంధనం కూడా మరింత భారం కానుంది. దీంతో వారి జేబులు ఖాళీ కానున్నాయి. అయితే పర్యావరణ కాలుష్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆ మాత్రం ఖర్చు భరించలేరా.. అని కూడా కొందరు వాదించవచ్చు. కానీ ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా బీఎస్‌ 6 వాహనాలను కొనే కస్టమర్లకు ఎంతో కొంత ఉపశమనం కలిగించేలా సబ్సిడీ లాంటివి ప్రకటిస్తే బాగుంటుందని, దీంతో ఆటోమొబైల్‌ రంగం కొంత వరకు మెరుగు పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచన చేస్తుందో, లేదో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version