కోవిడ్ వల్ల ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి.. కొన్ని నష్టాల్లో కొట్టుకొస్తున్నాయి..అయితే ఫార్మా కంపెనీలకు అయితే లాభాలే లాభాలు అనుకున్నాం.. కానీ కోవిడ్ వల్ల ఫార్మా కంపెనీలు కూడా భారీగా నష్టాలను ఎదుర్కోంటుందట.. వినడానికే విచిత్రంగా ఉంది కదా. ప్రస్తుతం కోవిడ్-19 కేసులు నామమాత్రంగా నమోదవుతున్నాయి. కరోనా ప్రభావం కూడా చాలావరకు తగ్గిపోయింది.. దీంతో వైరస్‌ను నిరోధించే మందుల వాడకం పూర్తిగా నిలిచిపోయింది.
కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో వైరస్‌ను ఎదుర్కోవడానికి కొన్ని కంపెనీలు ప్రత్యేక మందులను తీసుకొచ్చాయి. వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో వీటికి డిమాండ్ అమాంతం పెరిగింది. వాటి కోసం ఆస్పత్రుల ముందు కిలోమీటర్ల మేర ప్రజలు క్యూకట్టారు. కానీ ఇప్పుడు వాటి అవసరాలు తగ్గడంతో, ఫార్మా కంపెనీల్లో పెద్ద మొత్తంలో స్టాక్ మిగిలిపోయింది. ఆ స్టాక్‌ను ఏం చేయాలో తెలియని స్థితిలో ఫార్మా కంపెనీలు ఉన్నాయట.. కోవిడ్-19 రోగుల చికిత్సకు ఫావిపిరవిర్ (Favipiravir), రెమిడిసివ్ (Remdesivir) మందులను ఎక్కువగా వినియోగించిన విషయం మనకు తెలిసిందే. 2021 ఆగస్టు వరకు వీటి సేల్స్ ఎక్కువగా జరిగాయి. ఆ తర్వాత బ్లాక్ ఫంగస్‌కు నివారణగా లిపోసోమల్ యాంఫోటెరిక్ B మందు వినియోగం పెరిగింది.
కేసుల తగ్గుదలతో మారిన పరిస్థితులు
కోవిడ్ -19 కేసుల పతనం, ఈ మందుల డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.. కరోనా సెకండ్ వేవ్ సమయంలో, ఫార్మా కంపెనీలు మందుల తయారీకి భారీగా పెట్టుబడి పెట్టాయి. ఇప్పుడు డిమాండ్ లేక మందులు, యంత్రాలు, ముడిపదార్థాలన్నీ నిరుపయోగంగా ఉన్నాయి.. ఈ మందుల అమ్మకాలలో భారీ క్షీణతతో ఫార్మా కంపెనీలకు 5 కోట్ల రూపాయలకు పైగా విలువైన స్టాక్ తిరిగి వచ్చిందని సంస్థలు వెల్లడించాయి.
భారతదేశం అంతటా రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల విలువైన స్టాక్ రిటర్న్‌లను ఫార్మా కంపెనీలు అంగీకరించాయట.. కంపెనీలు, కెమిస్ట్స్ మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా కొంత స్టాక్ ఇప్పటికీ పెండింగ్‌లో ఉందట..
రూ.2,800 కోట్ల అమ్మకాలు
రెమ్‌డెసివిర్‌తో ఎటువంటి ఉపయోగం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీంతో విదేశాల నుంచి కూడా ఈ మందుకు ఘోరంగా గిరాకీ తగ్గింది. ఇప్పటికీ ఫావిపిరావిర్ ఎగుమతులకు అవకాశం ఉంది. రెమ్‌డిసివిర్ తయారు చేసిన ఫార్మాస్యూటికల్ కంపెనీలు, ఫావిపిరావిర్ ఉత్పత్తిలో పాల్గొన్న వాటి కంటే ఎక్కువ నష్టాలను నమోదు చేశాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. 2020 జూన్ నుంచి గత సంవత్సరం వరకు, రెమ్‌డిసివిర్, ఫావిపిరావిర్.. ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న మెడిసిన్‌గా ఉంది..
2020 జూన్ నుంచి 2021 ఆగస్టు వరకు మొత్తం 25 కోట్ల మాత్రలు, 50 లక్షల సీసాలు, రూ. 2,800 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. బ్లాక్ ఫంగస్ కోసం తయారు చేసిన రూ.22 కోట్ల విలువైన ఔషధాలు కంపెనీల వద్ద పెండింగ్‌లో ఉన్నాయట. ఈ మందుల్లో లిపోసోమల్ యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్లు, పోసాకోనజోల్ మాత్రలు, ముడి పదార్థాలు, ఎక్సిపియెంట్స్, ఇతర ముఖ్యమైన రసాయనాలు ఉన్నాయి.
ప్రభుత్వం స్పందించకపోతే.
కరోనా ప్రారంభంలో ఈ ఔషధాలకు మూడు నెలల షెల్ఫ్ లైఫ్ ఇచ్చారు, అనంతరం షెల్ఫ్ జీవితాన్ని 15 నెలల వరకు పొడిగించారు. తక్కువ ఎక్స్‌పైరీ టర్మ్ కారణంగా, రాబోయే కొద్ది నెలల్లో మెజారిటీ స్టాక్ గడువు ముగియనుంది. కోవిడ్-19 కేసులు ఇప్పటికీ వెలుగులోకి వస్తుండటంతో.. ప్రభుత్వం ఈ స్టాక్‌ను ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థలలో ఉపయోగించాలని ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) సెక్రటరీ జనరల్ రాజీవ్ సింఘాల్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు ప్రారంభించలేదు. మొత్తానికి కరోనా ఫార్మా కంపెనీలను కూడా వదలలేదు.