కమలం కోసమే పీకే..కారుని సెట్ చేస్తారా?

-

రాజకీయాల్లో అదిరిపోయే వ్యూహాలు వేసి ప్రత్యర్ధులకు చెక్ పెట్టే కేసీఆర్‌కే..ఇప్పుడు ఒక వ్యూహకర్త కావాల్సి వచ్చింది…ఇటీవల మారుతున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా కేసీఆర్….ప్రశాంత్ కిషోర్‌ని వ్యూహకర్తగా పెట్టుకున్నారు. అసలు రాజకీయాల్లో తిరుగులేని వ్యూహాలు వేసే కేసీఆర్‌కే వ్యూహకర్త కావాల్సి రావడం ప్రతి రాజకీయ విశ్లేషకుడుని ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి.

ఎందుకంటే రాజకీయాల్లో కేసీఆర్ ఏ విధంగా తన వ్యూహాలతో ప్రత్యర్ధులకు చెక్ పెట్టారో అందరికీ తెలిసిందే…అలాగే తన రాజకీయ గురువు అయిన చంద్రబాబుకే కేసీఆర్ చెక్ పెట్టారు…అసలు తెలంగాణలో చంద్రబాబుకే ప్లేస్ లేకుండా చేశారు. ఇక బలమైన ప్రత్యర్ధిగా ఉన్న కాంగ్రెస్‌ని దారుణంగా వీక్ చేశారు. ఇన్ని రకాలుగా ప్రత్యర్ధులకు చెక్ పెట్టిన కేసీఆర్…ఇప్పుడు రాజకీయంగా ఎదుగుతున్న బీజేపీకి కాస్త భయపడుతున్నట్లు కనిపిస్తోంది.

ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఏ విధంగా పుంజుకుందో అందరికీ తెలిసిందే…అధికార టీఆర్ఎస్‌కు ధీటుగా బీజేపీ రాజకీయం చేస్తూ వస్తుంది. టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనేలా బీజేపీ ముందుకెళుతుంది. అయితే బీజేపీకి చెక్ పెట్టడానికి కేసీఆర్ సైతం తనదైన శైలిలో వ్యూహాలు వేస్తూ ముందుకెళుతున్నారు. రాష్ట్రంలోనే కాకుండా…దేశంలో కూడా బీజేపీకి చెక్ పెట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.

జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలని ఏకం చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే బీజేపీకి వ్యతిరేక పార్టీలకు వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్‌ని…కేసీఆర్ సైతం తెలంగాణలో తమ పార్టీకి వ్యూహకర్తగా నియమించుకున్నారు. పీకే టీంకు చెందిన ఐప్యాక్ సంస్థతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే పీకే…తెలంగాణలో అప్పుడే పనిచేయడం మొదలుపెట్టారు..తాజాగా పీక్..కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో పర్యటించినట్లు తెలిసింది. సినీ నటుడు ప్రకాష్ రాజ్‌తో కలిసి పీకే..గజ్వేల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలని పరిశీలించారు.

అలాగే టీఆర్‌ఎస్‌ పాలన ఎలా ఉంది? ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? దళితబంధు అమలు తీరు.. తదితర అంశాలపై సర్వే చేస్తున్నారని తెలిసింది. మొత్తానికి తెలంగాణలో టీఆర్ఎస్‌ని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి పీకే స్ట్రాటజీలు వేస్తున్నారు..మరి పీకే సపోర్ట్‌తో తెలంగాణలో కారు స్పీడ్ పెరుగుతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version