ఆంధ్ర, తెలంగాణ రాజకీయనాయకులు కామెడీ చెయ్యడంలో పోటీ పడుతున్నారా?? స్వామి భక్తి చాటడం కోసం వారు చేస్తున్న భజన నవ్వుల పాలవుతుంది. భజన అంటే మామూలు భజన కాదండీ బాబు.. మొన్నటి వరకు కేటీఆర్ సీఎం కావాలి, కేసీఆర్ ప్రధాని కావాలంటూ కోరిన తెలంగాణ నేతలతో ఇప్పుడు ఆంధ్ర నాయకులు పోటీ పడుతున్నారు. తామేం తక్కువ తిన్నామనుకున్నారో లేక పీఎం పదవి సర్పంచ్ పదవనుకున్నారో గానీ కామెడీ మొదలెట్టేశారు.
అధ్యక్షా సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు దేశం లో ఎక్కడా లేడు. ఆయన ప్రధాన మంత్రి కావాలి. దేశ రాజకీయాల్లో ఆయన ఉండాలి అని మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ సాక్షిగా అన్నాడు. ప్లీజ్ అంటూ బతిమాలుకున్నాడు. ఒక్కసారి పీఎంని చెయ్యాలంటూ ప్రేమ కురిపించాడు. అంతకు ముందు మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కూడా పలు మీటింగుల్లో ఇవే మాటలు ప్రస్తావించారు. ఈ విధంగా మాట్లాడి సోషల్ మీడియాలో పరువు పోగొట్టుకున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు అంటూ నెటిజన్లు వీళ్లను తో ఆట ఆడుకున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ లోనే ఈ మాటలు వినిపించాయి. కానీ తాజాగా ఆంధ్రాలో కూడా జగన్ ప్రధానమంత్రి కావాలంటూ ఎమ్మెల్యే పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నాయకుడి దృష్టిలో పడాలని చేసే వృథా ప్రయాసే.. మార్కులు కొట్టేయాలని ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు.
బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌ని దేవుణ్ణి చేస్తే తప్పు లేదుగానీ మా సీఎం పీఎం అయితే తప్పేంటనే ప్రశ్నించవచ్చేమో గానీ.. సినిమా ఫంక్షన్స్‌లో పొగడ్తలే అందం.. వారికి, వారి ఫ్యాన్స్‌కి అవి ఉంటే గానీ కిక్కు ఉండదు మరి..
కానీ రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలకు అర్థం ఉండాలి. అధినాయకుల అనుగ్రహం పొందాలంటే అనేక రకాల మార్గాలు ఉన్నాయి. కానీ అవేవీ కాకుండా ప్రధానమంత్రి కావాలంటూ మాట్లాడుతున్నారంటే.. వాళ్ల విచక్షణ ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒకవేళ వారు అన్నట్టు నిజంగా కేసీఆర్, జగన్ లు ప్రధానమంత్రి పదవికి అర్హులా?ఆ స్థాయి వారికి ఉన్నదా? అనేది ఒకసారి బేరీజు వేసుకోవాలి. కేసీఆర్ అంటే ఇంతకు ముందు కేంద్ర మంత్రి పదవిని చేపట్టారు.. కేసీఆర్ రాజకీయ అనుభవం ప్రథానమంత్రి పదవికి తక్కువే కాకపోవచ్చు.. కాబట్టి కొంతవరకు ఆలోచించవచ్చు. కానీ మొదటిసారి సీఎం అయినటువంటి జగన్ కు ప్రధానమంత్రి అనేది అందని ద్రాక్షా వంటిదే.. ఒకసారి ఆంధ్ర నాయకులు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలు.. అందునా దాయాదుల వంటి పంచాయితీలు ఉండనే ఉన్నాయి.. మరి ఒక ప్రాంతానికి న్యాయం చేస్తే మరో ప్రాంతానికి అన్యాయం చేసినట్లే అవుతుంది. ఇక నీళ్ల పంచాయతీ తెలట్లేదు.. ఇక ఇవన్నీ పక్కన పెడితే వేరే రాష్ట్రాల్లో ఉన్న పార్టీల నుంచి కూడా వీరికి పెద్దగా మద్దతు లేదు. అలాంటప్పుడు వీరు ప్రధానమంత్రి ఎలా అవుతారు. అంత తెలిస్తే రాజకీయ నాయకులు అయ్యేవారే కాదంటూ సెటైర్లు పడుతున్నాయి.
గతంలో ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యయనానికి తెరలేపాయి. కేంద్రంలో ప్రాంతీయ పార్టీ నేత దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు దేవేగౌడ కు మద్దతు తెలిపాయి. కాబట్టి ఆయన ప్రధాన మంత్రి అయ్యారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. కేంద్రంలో లో సింగిల్ గా అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశంలో దాదాపు ఎక్కువ రాష్ట్రాలలో అధికారంలో ఉంది.
ఇలాంటి సందర్భాలలో కేవలం తొమ్మిది మంది ఎంపీలు ఉన్న సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యే అవకాశ ఎక్కడిది? అలాగే జగన్ కూడా అలాంటి అవకాశమే లేదు. కానీ వారి మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం ఈ విషయాలను కూడా ఆలోచించకుండా వాస్తవంగా జరగని విషయాలను పదేపదే మాట్లాడితే జనాలలో వారే నవ్వుల పాలు అవుతారు.
పొగడ్తలు పన్నీరులా చల్లుకోవాలే కానీ,, తాగేయవద్దు..