స్థానిక భాషలకు జై అన్న ప్రధాని మోడీ… ఇది ఉత్తరాది నేతల చెవికెక్కుతుందా?

-

ఈరోజు దేశంలో రెండు ప్రముఖ ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండూ భాషకు సంబంధించినవే. ఇందులో ఒకరు ప్రధాని నరేంద్రమోడీ. మరొకరు ఉత్తరప్రదేశ్ మంత్రి సంజయ్ నిషాద్. ఇద్దరు కూడా భాషకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఒకే ప్రభుత్వానికి చెందిన ఇద్దరు నేతలు భాషకు సంబంధించి వేర్వేరుగా స్పందించడమే గమనార్హం.

యూపీ కేబినెట్‌లోని మంత్రి సంజయ్ నిషాద్ ఏమో.. ‘హిందీ మాట్లాడని వారు దేశం విడిచి పోవాలి. లేదంటే దేశ ద్రోహులుగా ముద్రవేస్తాం’’ అని హెచ్చరించారు. అదే ఢిల్లీలో ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన ప్రధాని మోడీ మాత్రం.. అందుకు భిన్నంగా స్పందించారు. ‘‘న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలి. తద్వారా సాధారణ పౌరుల్లో విశ్వాసం పెంపొందించడమే కాకుండా న్యాయవ్యవస్థకు వారిని దగ్గర చేసినట్లు అవుతుంది’’ అని పేర్కొన్నారు. త‌ద్వారా స్థానిక, మాతృభాషల ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు.

మ‌రి భాష విష‌యంలో ఎందుకీ స‌మ‌స్య‌? మ‌నమంతా భార‌తీయుల‌మంటూనే మ‌రొక‌రి భాష‌పై ద‌బాయింపు ఎందుకు? వారి భాష‌నే ఎందుకు రుద్దాల‌ని అనుకుంటున్నారు? ప్రశ్న‌లు చిన్న‌వే అయినా.. స‌మాధానాలు మాత్రం బ‌హు సంక్లిష్టం.

క్లుప్తంగా చెప్పాలంటే.. మ‌న దేశంలోని ప్రజ‌లు ఏం తినాలో, ఏం ధ‌రించాలో, ఎవ‌రిని ప్రార్థించాలో, ఏ భాషా మాట్లాడాలో.. అన్నది ఆధిపత్య వర్గాల హక్కుగా భావించి రుద్దడంతోనే సమస్య మొదలయ్యిందన్నది వాస్తవం. ఇతర భాషల విలువ తగ్గించడం.. ఆ తర్వాత వారి భాషను రుద్ది.. అనంతరం సాంస్కృతిక‌ దాడి చేయడం.. ఇది చరిత్ర చెబుతన్న నిష్టుర సత్యం. అందుకే మాతృభాషల జోలికి వస్తే సంఘర్షణ తప్ప‌డం లేదు. ఇది ఇండియా అయినా.. మ‌రో దేశ‌మైనా వివాదం త‌ప్ప‌దు.

ప్రతి ఒక్కరికి మాతృభాషాభిమానం ఉంటుంది. స్వాభిమానం ఉన్నవారెవరైనా ఇతర భాషలను తమపై రుద్దడాన్ని వ్యతిరేకిస్తారు. పరాయి భాష పెత్తనం చేయ‌డం మొద‌లైతే సాంస్కృతికంగా, రాజ‌కీయంగా ప‌రాయీక‌ర‌ణ చెందడం ఖాయం. అది నిరూపితం కూడా. బాలీవుడ్ నటుడు అజ‌య్ దేవ‌గ‌న్ ప్రాంతీయ భాష‌ల‌ప‌ట్ల ఉన్న చిన్న చూపుతో హిందీ ఆధిప‌త్యం ప్రద‌ర్శిస్తే కన్నడ న‌టులే కాదు రాజ‌కీయ నేత‌లు కూడా విమ‌ర్శించారు. అందులో బీజేపీ వాళ్లు కూడా ఉన్నారు. త‌మిళ‌నాడు బీజేపీ అధ్యక్షుడే… మాకు త‌మిళ భాష‌, త‌మిళ సంస్కృతే ముఖ్యమ‌ని ఉత్తరాధి ఆధిప‌త్యం, హిందీ ఆధిప‌త్యాన్ని ఎప్పటికీ తిర‌స్కరిస్తామ‌ని ప్రక‌టించారు.

దేశంలో సుమారుగా 19, 500 భాషలు చలామణి లో వున్నాయి . అంటే వీటిని మాట్లాడే ప్రజలు, భాషలు ఇవేమీ భారతీయం కాదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయమూర్తుల సదస్సులో ప్రధాన మోడీ చేసిన సూచనను, స్థానిక భాషల ప్రాధాన్యత గురించి స‌మ‌గ్రంగా తెలుసుకుంటే దేశ సమగ్రతకు భంగం కలిగించని వారిమి అవుతామని ఉత్తరాది నేతలు గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version