స్వదేశీ వస్తువులను మాత్రమే వాడాలి.. విదేశీ వస్తువులను వాడకూడదు.. ఈ నినాదం ఇప్పటిది కాదు.. స్వాతంత్య్రోద్యమ సమయంలో మహాత్మా గాంధీ పిలుపునిచ్చారు. తెల్లవారి అజమాయిషీ మన దేశంపై తగ్గాలంటే.. మన దేశంలో తయారయ్యే వస్తువులను మాత్రమే వాడాలని ఆయన అప్పట్లో అన్నారు. అయితే ఆ నినాదాన్ని ఇప్పుడు ప్రధాని మోదీ అందుకున్నారు. లాక్‌డౌన్ 4.0 నేపథ్యంలో దేశానికి రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన ఆయన మేడిన్ ఇన్ ఇండియా నినాదం చేశారు. అయితే ఆయన ఆ నినాదం అలా చేశారో లేదో.. వెంటనే యాక్షన్ ప్లాన్ కూడా ప్రారంభించారు.
ప్రధాని మోదీ మేడిన్ ఇన్ ఇండియా నినాదం మేరకు.. ఇకపై అన్ని పారామిలిటరీ క్యాంటీన్లలో కేవలం స్వదేశీ వస్తువులను మాత్రమే వాడనున్నారు. మన దేశంలో తయారయ్యే ఉత్పత్తులనే ఆయా క్యాంటీన్లలో వినియోగించనున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఈ విధానం అమలు కానుంది. ఇక త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, చట్ట సభల్లోనూ స్వదేశీ వస్తువులను మాత్రమే వాడాలని చెప్పి కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుందని తెలుస్తోంది.
ప్రధాని మోదీ నిజానికి గతంలో మేకిన్ ఇండియా.. అని ఓ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దాని ఉద్దేశం.. స్వదేశీ, విదేశీ ఏ కంపెనీ అయినా సరే.. భారత్‌లోనే ఎక్కువగా ఉత్పత్తులను తయారు చేయాలి. దీంతో దేశ జీడీపీకి అది దోహదపడుతుంది. అయితే అది అంత ఆశాజనకమైన ఫలితాలను ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఆయన మేడిన్ ఇన్ ఇండియా నినాదం అందుకుని.. ఆగేది లేదని అంటున్నారు.. అయితే ఈ నినాదాన్ని మాత్రం మోదీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చూస్తున్నారు. మరి అది సక్సెస్ అవుతుందా… కాదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.