స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలో జన్‌ధన్ ఖాతాలు ఉన్న ప్రజలకు ప్రధాని మోడీ వరాలను ప్రకటించనున్నారట. దాదాపుగా 32 కోట్ల మంది ప్రజలకు జన్‌ధన్ ఖాతాలు ఉండడంతో వారందరికీ ఈ వరాలు అందనున్నాయి. ఈ నెల 15వ తేదీన ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కిస్తారు. అయితే ఆ వేదిక నుంచే జన్‌ధన్ ఖాతాదారులకు అందించే ప్రయోజనాలను మోడీ తెలియజేస్తారట.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున జన్‌ధన్ ఖాతాదారులకు మోడీ ప్రకటించనున్న వరాలు ఈ విధంగా ఉన్నాయి. జన్‌ధన్ ఖాతాదారులకు ప్రస్తుతం ఉన్న ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని రెట్టింపు చేసి రూ.10వేలకు పెంచనున్నట్లు తెలిసింది. అలాగే రూపే కార్డులు ఉన్నవారికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్‌ను రూ.1 లక్ష వరకు పెంచుతారని తెలిసింది. అలాగే అటల్ పెన్షన్ యోజన కింద పెన్షన్ పరిమితిని రూ.5వేల నుంచి రూ.10వేల వరకు పెంచుతారట.
గత నాలుగు సంవత్సరాల కాలంలో మొత్తం 32.25 కోట్ల మంది జన్‌ధన్ ఖాతాలను తెరిచారు. ఆ అకౌంట్లలో రూ.80,674 కోట్ల నగదును జమ చేశారు. ఇక అటల్ పెన్షన్ యోజన స్కీంలో చేరిన వారు 60 ఏళ్లు నిండితే తాము జమ చేసే ప్రీమియాన్ని బట్టి రూ.1000 నుంచి రూ.5వేల వరకు పెన్షన్ తీసుకునే సౌలభ్యం ఉంటుంది. కాగా ఇదే మొత్తాన్ని స్వాతంత్ర్య దినోత్సవం రోజున రూ.10వేల వరకు పెంచుతారని తెలిసింది.