ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన రోడ్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లపై మంత్రులు, అధికారులతో చర్చించారు. ప్రధాని మోడీ మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతికి చేరుకుని 15 నిమిషాల పాటు రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ సందర్శిస్తారు.
అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ సమావేశంలో ప్రధాని పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణపై అధికారులు సీఎంకు వివరించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచనలు చేశారు. ఈ సమీక్షా సమావేశానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.