కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజల సాకారం కూడా అత్యంత కీలకమైనది. భౌతిక దూరం పాటించడంతోపాటు, కొద్ది రోజుల పాటు ఇళ్లకే పరిమితమైతే కరోనా వ్యాప్తికి తగ్గించవచ్చు. ఇందుకోసం ఆయా దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. లాక్‌డౌన్ విధించడంతో పాటు.. ఇందుకు సహకరించాలని ప్రజలను కోరుతున్నాయి. అయితే కొన్ని చోట్ల ఈ నిబంధనలను పట్టించుకోని ప్రజలను బతిమాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మరికొన్ని చోట్ల దూకుడుగా వ్యవహరించాల్సి కూడా వస్తోంది.
అయితే ఇండోనేషియా జావా ద్వీపంలోని కెపుహ్ గ్రామంలో ప్రజలు ఎంత చెప్పినా భౌతిక దూరం పాటించకపోవడంతొ అక్కడి యూత్ గ్రూప్ వినూత్నంగా ఆలోచించింది. మంచి చెబితే వినిపించుకోని ప్రజలను భయపెట్టైనా ఇళ్లకే పరిమితం చేయాలనే నిర్ణయానికి వచ్చింది. వెంటనే అక్కడి ప్రజలు భయపడే పోకోంగ్ (దెయ్యాలు)లను వీధుల్లో ఏర్పాటు చేశారు. మనుషులకు తెల్లని వస్త్రం చుట్టి దెయ్యం మాదిరి తయారు చేస్తారు. ఈ వేషం వేయడానికి పలువురు వాలంటీర్లు పనిచేస్తున్నారు. అయితే పోకోంగ్‌లో ఆత్మలు ఉంటాయని అక్కడి ప్రజల నమ్మకం. వీధుల్లో పోకోంగ్‌లు ఏర్పాటు చేయడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. పోలీసులు సహకారంతో తాము ఈ పని చేస్తున్నామని.. ఇలా చేయడం ద్వారా ప్రజలు భయంతోనైనా బయటకు రావడం లేదని యూత్ గ్రూప్ సభ్యులు చెబుతున్నారు.
కాగా, ఇప్పటివరకు ఇండోనేషియాలో 4,241 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 373 మంది కరోనా బారిన పడి చనిపోయారు.