కొత్తగా ఎవరైనా హోటల్ లేదా ఫుడ్ స్టోర్ ప్రారంభిస్తే లాంచింగ్ సందర్భంగా ఆఫర్లను అందించడం పరిపాటే. దాని వల్ల కస్టమర్లు వారి ఫుడ్‌కు అలవాటు పడతారు. వేగంగా వ్యాపారం పుంజుకుంటుంది. అయితే తమిళనాడులో ఓ వ్యక్తి కూడా సరిగ్గా ఇలాగే చేశాడు. కానీ అతను ఇంకా ఒక అడుగు ముందుకు వేసి భారీ ఆఫర్‌ను ప్రకటించాడు. దీంతో జనాలతో అతని షాప్ కిక్కిరిసిపోయింది. ఫలితంగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
తమిళనాడులోని అరుప్పుకొట్టై అనే ప్రాంతంలో జహీర్ హుస్సెయిన్ అనే వ్యక్తి బిర్యానీ షాప్ ను కొత్తగా పెట్టాడు. ఆదివారం ఆ షాప్ ప్రారంభమైంది. అయితే షాప్ ప్రారంభం సందర్భంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్లేట్ బిర్యానీని కేవలం రూ.10కే అందిస్తున్నానని పబ్లిసిటీ చేశాడు. దీంతో అదే టైముకు జనాలు అతని షాప్ వద్ద భారీగా క్యూ కట్టారు. ఈ క్రమంలో జనాలలో తోపులాట మొదలైంది. సోషల్ డిస్టన్స్‌ను గాలికొదిలేశారు. మాస్కులను తీసేశారు. రోడ్డుపైకి క్యూ చేరి ట్రాఫిక్ జాం నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
జనాల రద్దీతో రోడ్డుపై ట్రాఫిక్ జాం నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకుని అందరినీ అక్కడి నుంచి పంపించివేశారు. కరోనా వ్యాప్తికి కారణమయ్యాడంటూ జహీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను ఆదివారం అమ్మేందుకు సిద్ధంగా ఉంచిన 2500 బిర్యానీ ప్యాకెట్లలో 500 అమ్ముడయ్యాయి. ఇక మిగిలిన వాటిని పోలీసులు స్థానికంగా ఉన్న పేదలకు పంచారు. జహీర్‌పై పోలీసులు 188, 269, 278 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే మళ్లీ ఇలాంటి పనులు చేయవద్దని అతనికి పోలీసులు బెయిల్ ఇచ్చారు.