ఎట్టకేలకి నిన్న పొద్దుపోయాక ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్ రేప్ ఘటనలో బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పరామర్శించారు. నిజానికి ముందుగా మొన్న రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వారిని కలిసేందుకు వెళ్లేందుకు బయలుదేరగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా యూపీ పోలీసులు వ్యవహరించిన తీరు పెను దుమారానికి దారి తీసింది. అయితే ప్రియాంక కాలర్ ని ఒక మగ పోలీస్ పట్టుకు లాగుతున్న పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ పిక్ ని పోస్ట్ చేసి మరీ సోషల్ మీడియాలో పోలీసుల మీద యోగి ప్రభుత్వం మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ పోలీసుల తీరుతో యోగి ప్రభుత్వం పరువుపోతోందంటూ ఏకంగా బీజేపీ అగ్రనేత ఉమా భారతి వ్యాఖ్యానించిందంటే ఏమేరకు ఆ పోలీసుల రుబాబు నడించిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక నిన్న అయితే రాహుల్, ప్రియాంకా గాంధీ సహా మరో ముగ్గురు హత్రాస్ బాధిత కుటుంబాన్ని కలిసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో నిన్న హత్రాస్ కు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితురాలి తల్లిని అక్కున చేర్చుకుని ఓదార్చారు ప్రియాంకా గాంధీ.