జమ్ముకశ్మీర్ డీజీ మర్డర్ కేసు.. పని మనిషి డైరీలో ఏం ఉందంటే..?

-

జమ్మూకశ్మీర్‌లో జైళ్ల శాఖ డీజీని హత్య చేసినట్లు అనుమానిస్తోన్న పని మనిషి డైరీని పోలీసులు గుర్తించారు. అతడు తన భవిష్యత్తు, మరణం గురించి రాసిన రాతలు అతడి ఆలోచనా ధోరణిని వెల్లడిచేస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఆ మాటలను బట్టి అతడు డిప్రెషన్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు.

యాసిర్ అహ్మద్(36) గత ఆరునెలలుగా డీజీ హేమంత్ లోహియా ఇంట్లో పనిచేస్తున్నాడు. అతడు దుందుడుకుగా ప్రవర్తించేవాడని, డిప్రెషన్‌లో ఉన్నాడని విచారణ అధికారి ఒకరు తెలిపారు. ఇక అహ్మద్‌కు సంబంధించిన డైరీలో హిందీ పాటలు ఉన్నాయని, అందులో ఒకటి ‘నన్ను మర్చిపో’ పేరిట రాసి ఉందని పేర్కొన్నారు.

‘ఓ మరణమా.. నా జీవితంలోకి రా. ప్రస్తుతం నేను నాకు నచ్చని జీవితం జీవిస్తున్నాను. ఈ జీవితం నాకు నచ్చట్లేదు. జీవితం అంటే విషాదం మాత్రమే. ప్రేమ 0 శాతం, టెన్షన్ 90 శాతం, బాధ 99 శాతం, నకిలీ నవ్వు 100 శాతం. ప్రస్తుతం నేను బతుకుతున్న జీవితంతో నాకే సమస్యా లేదు. కానీ ఇబ్బంది అంతా భవిష్యత్తు గురించే’ అని ఆ డైరీలో ఉన్నట్లు పోలీసు వర్గాలు చెప్పాయి.

మరోవైపు డీజీ హేమంత్ లోహియాను తామే హత్య చేసినట్లు పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్​-పీఏఎఫ్​ఎఫ్​ అనే సంస్థ ప్రకటించింది. “కట్టుదిట్టమైన భద్రత మధ్య కశ్మీర్​ పర్యటనకు వస్తున్న హోం మంత్రికి ఇదొక చిరు కానుక. మున్ముందు ఇలాంటి ఆపరేషన్లు మరిన్ని చేపడతాం” అని ఆ ప్రకటనలో పేర్కొంది పీఏఎఫ్​ఎఫ్​.

Read more RELATED
Recommended to you

Exit mobile version