మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్ ఎపిసోడ్.. పోలీసుల కస్టడీలో నిందితులు

-

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కేసులో నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. హైదరాబాద్‌ చంచల్‌గూడ జైలు నుంచి ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీ స్వామీజీలను విచారణ నిమిత్తం పోలీసులు తీసుకెళ్లారు. ఈ కేసులో నిందితులను ఐదురోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో మొయినాబాద్ పోలీసులు పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు ముగ్గురు నిందితులను కస్టడీకి అనుమతి ఇచ్చింది కానీ కేవలం రెండ్రోజుల కస్టడీకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కస్టడీలోకి తీసుకున్న ముగ్గురు నిందితులను సాయంత్రం ఐదు గంటల వరకు న్యాయవాది సమక్షంలో పోలీసులు ప్రశ్నించనున్నారు. ఆ తర్వాత తిరిగి చంచల్​గూడ జైలుకు తరలించనున్నారు. తిరిగి రేపు యథావిధిగా మరోసారి విచారణ కోసం వారిని కస్టడీలోకి తీసుకోనున్నారు. ముగ్గురు నిందితులను ప్రశ్నించడం ద్వారా కేసులో పురోగతి సాధించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

నిందితులు ముగ్గురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని… కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభపెట్టారని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముగ్గురు నిందితుల వెనక ఎవరెవరున్నారనే విషయాలను తెలుసుకోవడానికి నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరారు. రాజకీయ కారణాలతో ముగ్గురిపైనా అక్రమ కేసులు బనాయించారని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version