ఇప్పటికే ఏపీలో నేరాలు పెరిగిపోతూ, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని వస్తున్న ఆరోపణల నేపధ్యంలో, విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఒక్క సారిగా అందరి దృష్టి తనపై నిలుపుకునేలా చేసింది.. ఈ దెబ్బకు బెజవాడ పోలీసులు నేరస్దులపై సీరియస్‌గా దృష్టిసారించారు. ఈ క్రమంలో నేరాలను తగ్గించే దిశగా వారి వద్ద ఉన్న ప్రణాళికను అమలు చేస్తున్నారు..
ఇకనుండి ఇలాంటి గ్యాంగ్‌వార్‌లకు అవకాశం లేకుండా ఉండేందుకు రౌడీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నగర సీపీ బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు నేరాల అదుపుతోపాటు, శాంతి భద్రతలపై సీరియస్‌గా దృష్టి సారించడమే కాకుండా నగరంలోని పాత కొత్త రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతే కాకుండా ఈ గ్యాంగ్‌లోని వారు, వీరితో పాటుగా మిగతా సభ్యులందరి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీరంతా ఎక్కడ నివాసం ఉంటున్నారు. ఏం పని చేసి జీవిస్తున్నారని ఆరా తీశారు.
ఇకపోతే ఒక్క రోజే అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 47 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.. ఇదేకాకుండా నగరంలో ఎక్కడైనా పాత నేరస్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, ఇబ్బంది పెడుతుంటే తమ దృష్టికి తెచ్చిన వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో విషాన్ని చిమ్ముతూ జీవించకుండా, తాము నేరస్దులము, రౌడీషీటర్లమనే ఆలోచనలన్ని పక్కన పెట్టి అందరితో కలసిపోయి మంచిగా జీవనం సాగిస్తున్న వారు తమ దృష్టికి తీసుకువస్తే అధికారులతో చర్చించి రౌడీషీట్ ఎత్తివేసేలా కృషిచేస్తామని పోలీస్ అధికారులు తెలిపారు..