ఎమ్మెల్సీ ఎన్నికలు: రవీందర్ సింగ్ ఝలక్ ఇస్తారా? కాంగ్రెస్ గట్టెక్కుతుందా!

-

సంఖ్యా బలం ఉంది. అయినా, టీఆర్‌ఎస్ క్యాంపు నిర్వహించింది. కాంగ్రెస్ అభ్యర్థులను బరిలో నిలపడం, మాజీ మేయర్ రవీందర్ సింగ్ బరిలో ఉండటంతో ఆచితూచి అడుగులు వేసింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా రవీందర్ సింగ్, ఝలక్ ఇస్తారా? కాంగ్రెస్ గట్టుక్కుతుందా అనే ఆసక్తి నెలకొంది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు హడావుడి కొనసాగుతున్నది. ఈ ఎన్నికలతో సాధారణ జనానికి ఎలాంటి సంబంధం లేకున్నా హాట్‌టాపిక్‌గా మారాయి. 12 స్థానాలకుగాను ఇప్పటికే ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఆరు స్థానాలకు శుక్రవారం ఎన్నిక జరగనున్నది. సంఖ్య బలం అధికార టీఆర్ఎస్ క్యాంపులు నిర్వహించడం, రెండు స్థానాల్లో కాంగ్రె్ అభ్యర్థుల నిలుపడం, మాజీ మేయర్ రవీందర్ సింగ్ తిరుగుబాటు చేసి బరిలో నిలవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో స్వతంత్రులు బరిలో ఉన్నా అంగా ప్రభావం చూపే స్థాయిలో లేరు. కాబట్టి, ఆయా స్థానాల్లో అధికార పార్టీ గెలుపు నల్లేరు పైన నడకే. మిగిలిన చోట్ల బలమైన అభ్యర్థులు బరిలో నిలవడంతో ఆసక్తి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్‌లో ఒక స్థానంపై టీఆర్‌ఎస్‌కు ఎలాంటి అనుమానం లేదు. కానీ, మరో స్థానానికి మాజీ మేయర్ రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులపై ప్రభావం చూపగలరు. మరోవైపు ఉమ్మడి మెదక్‌లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభ్యర్థి నిర్మల బరిలో నిలవడంతో ఫలితాలు ఎలా ఉంటాయో అన్న ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు కూడా బలమైన అభ్యర్థే కావడం గమనార్హం.

ఎన్నికలు జరుగుతున్న ఐదు జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్‌కే ఎక్కువ మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారు. కానీ, అధికార పార్టీ ఎలాంటి చాన్స్ తీసుకోవాలనుకోలేదు. అందుకోసం నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచే క్యాంపులు నిర్వహించింది. ప్రజాప్రతినిధులు అందరినీ క్యాంపులకు తరలించింది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకున్నది. ప్రజాప్రతినిధులు గురువారం ఆయా జిల్లాలకు చేరుకున్నారు. వారికి టీఆర్‌ఎస్ నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు.

కరీంనగర్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడి నుంచి మాజీ మేయర్ రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జిల్లాలో 1324 మంది ప్రజా ప్రతినిధులకు టీఆర్‌ఎస్‌కు చెందిన వారు 996 మంది ఉన్నారు. మిగిలిన వారు కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్ర ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీరంతా రవీందర్ సింగ్ ఓటు వేసినా ఆయన గెలుపు సాధ్యం కాదు. కచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరగాల్సిందే. ఇక్కడే రవీందర్ సింగ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒక్క ఓటు టీఆర్‌ఎస్‌కు మరో ఓటు తనకు వేయాలని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌లో తొలి నుంచి కొనసాగడం, మేయర్‌గా పనిచేసి ఉండటంతో క్రాస్ ఓటింగ్ జరుగుతుందని, తాను ఒక్క ఓటుతోనైనా బయట పడతానని ధైర్యంలో రవీందర్ సింగ్ ఉన్నారు.

ఉమ్మడి మెదక్, ఖమ్మం అభ్యర్థులు కూడా క్రాస్ ఓటింగ్‌పైనే నమ్మకం పెట్టుకున్నారు. తమకున్న పాత పరిచయాలు లాభం చేకూరుస్తాయని వారు భావిస్తున్నారు. మెదక్‌లో 777 ఓట్లకు గాను కాంగ్రెస్‌కు 230 మంది ప్రజాప్రతినిధులు మాత్రమే ఉన్నారు. అయినా జగ్గారెడ్డి తన భార్య నిర్మలను బరిలో నిలిపారు. తమ వ్యూహాలు ఫలించి కాంగ్రెస్ ఓటింగ్ జరిగితే గెలుస్తామని భావిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మంలో కూడా రాయ నాగేశ్వరరావు అదే అంచనాల్లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version