తుంగతుర్తి పోరు..గాదరి హ్యాట్రిక్‌కి అద్దంకి బ్రేకులు.!

-

గెలుపు దగ్గర వరకు వచ్చి..చాలా తక్కువ ఓట్లతో ఓడిపోతే అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదు. అయితే ఒకసారి అంటే పర్లేదు. మళ్ళీ మళ్ళీ అదే జరిగితే అలాంటి బ్యాడ్ లక్ నాయకుడు ఎవరు ఉండరు. కానీ తెలంగాణ రాజకీయాల్లో అలా గెలుపు దగ్గర వరకు వచ్చి బోల్తా కొట్టిన నాయకుల్లో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు.

2014, 2018 ఎన్నికల్లో సరిగ్గా గెలుపు దగ్గర వరకు వచ్చి తక్కువ ఓట్లతో ఓటమిని ఎదురుకున్నారు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తిలో బి‌ఆర్‌ఎస్ నుంచి గాదరి కిషోర్, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో టి‌డి‌పి 31 వేల ఓట్ల వరకు తెచ్చుకుంది. అయితే ప్రధాన పోటీ బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య జరిగింది. ఈ పోరులో అద్దకి..కేవలం 2 వేల ఓట్ల తేడాతో గాదరి చేతిలో ఓడిపోయారు.

సరే ఒకసారి కాదు అనుకుంటే..2018 ఎన్నికల్లో మళ్ళీ పరాజయమే ఎదురైంది. కేవలం 1800 ఓట్ల తేడాతో మళ్ళీ దయాకర్ ఓడిపోయారు. అయితే అప్పుడు ఈవీఏంల్లో మోసాలు జరిగాయని అద్దంకి ఆరోపించారు. సరే ఏం జరిగిందో ఎవరికి తెలియదు. మళ్ళీ గాదరి గెలిచారు. ఇప్పుడు మూడోసారి కూడా ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు.

బి‌ఆర్‌ఎస్ నుంచి గాదరి, కాంగ్రెస్ నుంచి అద్దంకి బరిలో ఉండనున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండటంతో సాధారణంగానే గాదరిపై వ్యతిరేకత ఉంది. ఇటు అద్దంకిపై సానుభూతి ఉంది. అలాగే ఈ సారి బి‌ఆర్‌ఎస్ వేవ్ అంతగా ఉండకపోవచ్చు. కాబట్టి ఈ సారి అద్దంకి..గాదరికి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే గాదరి హ్యాట్రిక్ కు బ్రేకులు వేయగలరా? లేదా? అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version