ఏపీలో ఎప్పటినుంచో ముందస్తు ఎన్నికలపై చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చర్చ తీసుకొచ్చింది టిడిపి అధినేత చంద్రబాబు..గతేడాది నుంచి ఆయన..జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని చెబుతూ వస్తున్నారు. కానీ అధికార వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు ముందస్తు ఉండదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని అంటున్నారు.
అయితే జగన్ ఇటీవల ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో ముందస్తు ఎన్నికల గురించి చర్చ చేశారని, ఇక జగన్ ముందస్తుకు వెళ్లిపోవడం ఖాయమని..తెలంగాణ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో బాబు మినీ మేనిఫెస్టో ప్రకటించడం, ఇటు పవన్ వారాహితో ఎన్నికల ప్రచారానికి రెడీ కావడం..ఇంకా జగన్ ఏదొక కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోనే ఉంటున్నారు. దీంతో ముందస్తు ఖాయమనే ప్రచారం. అయితే తాజాగా ముందస్తు ఎన్నికలపై జగన్ క్లారిటీ ఇచ్చేశారు. ఏపీ కేబినెట్ సమావేశం పెట్టి అందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్..ఎన్నికలకు మరో9 నెలల సమయం ఉందని, ఈ లోపు అందరూ ప్రజల్లోకి వెళ్లిపోవాలని సూచించారు.
దీని బట్టి చూసుకుంటే జగన్ ముందస్తుకు వెళ్ళడం లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తారని తెలుస్తుంది. ఇక కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ ఉద్యోగుల కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లును తీసుకొచ్చింది. 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపగా, జగనన్న అమ్మ ఒడి పథకాన్ని జూన్ 28న అమలు చేయనున్నారు. 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగింపునకు రూ. 6,888 కోట్ల వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ.445 కోట్ల రుణాల కోసం ఏపీఎఫ్ఎస్ఎల్‌కు అనుమతి ఇచ్చింది. ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా 5 వేల కోట్ల రూపాయల రుణ సేకరణకు అనుమతి ఇచ్చింది.