మీరే మాకు స్ఫూర్తి.. అమెరికాలోని తెలుగు ప్రజలనుద్దేశించి సీఎం జగన్‌ వ్యాఖ్య

-

అమెరికాలోని డాలస్‌లో జరుగుతున్న నాటా తెలుగు మహా సభలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో సందేశాన్ని అక్కడి తెలుగు ప్రజలు వీక్షించారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉంటూ వివిధ స్థాయిల్లో స్థిరపడిన అందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. గొప్పవైన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ చక్కటి ఐకమత్యాన్ని చాటడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని సీఎం అన్నారు.అమెరికాలో ఉన్న ప్రతి తెలుగువారినీ చూస్తున్నప్పుడు ఆ స్ఫూర్తి ఏపీలోని ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా ఉందని అన్నారు.

2023 నాటా కన్వెన్షన్‌కు హాజరయిన ప్రతి ఒక్కరికీ బెస్ట్‌ విషెస్‌ తెలియజేసిన సీఎం మరికొన్ని అంశాలను వారితో పంచుకున్నారు. నాటాలోని కార్యవర్గ సభ్యులకు పేరుపేరునా అభినందనలు తెలియజేస్తూ పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్న తెలుగు వారిని చూస్తుంటూ గర్వంగా ఉందని చెప్పారు. వారిలో అనేకమంది పేద, మధ్యతరగతి కుటుంబాల్లో నుంచి వచ్చినా.. అమెరికా వంటి దేశంలో రాణించడానికి కఠోరమైన కమిట్‌మెంట్,ఫోకస్‌ ఈ రెండూ గ్టటిగా నిలబెట్టాయని సీఎం వ్యాఖ్యానించారు.
అలాంటి కమిట్‌మెంట్,ఫోకస్‌ ఏపీలోని యువతలో ఉండటం తానే కళ్లారా చూశానన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని తెలియజేశారు.

గ్లోబల్‌ సిటిజన్‌గా ఏపీలోని యువత ఎదగడానికి చదువే పెద్ద సాధనం అని చెప్పిన సీఎం…. చదువే సరైన సాధనం అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలోని గవర్నమెంట్‌ బడులన్నీనాడు-నేడు కార్యక్రమంతో రూపురేఖలు మార్చుకున్నాయన్నారు. 8వ తరగతిలోకి రాగానే పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నామన్నారు. దీనివలన డిజిటల్‌ ఎడ్యుకేషన్‌కి పెద్ద పీట వేశామని స్పష్టం చేశారు.3వ తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్లను నియమించామని చెప్పిన సీఎం …. 6వ తరగతి నుంచి ప్రతి తరగతిలోనూ డిజిటల్‌ విద్యను అందించేలా ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇంకా సీఎం ఏమన్నారంటే. . . . అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యా కానుక, ఉన్నత విద్యలో అయితే విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలన్నీ కూడా రాష్ట్రంలో గొప్పగా అమలు చేస్తున్నామని అన్నారు. చదువు అనే ఒక ఆయుధం ఎంత అవసరమో చెప్పడానికే ఇవన్నీ….ఇంతగా చెప్పాల్సి వస్తుందన్నారు. విలేజ్‌ సెక్రటేరియట్‌ విధివిధానాలను సీఎం వివరించారు. గ్రామాల్లో ప్రతి 50 నుంచి 100 ఇళ్లకు ఒక వాలంటీర్‌ నియమించామని,పౌర సేవల్ని వాలంటీర్లు డోర్‌ డెలివరీ చేస్తున్నారని చెప్పారు. పెన్షన్, రేషన్‌… అన్నీ మన ఇంటి ముంగటికే వచ్చే గొప్ప వాతావరణం ఏపీలో సృష్టించామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ రాబోయే రోజుల్లో ఒక దిక్సూచిగా అవుతాయని చెప్పారు. ఇప్పుడు గ్రామాల్లో ఇంగ్లిషు మీడియం బడులు అందుబాటులో ఉన్నాయని చెప్పిన సీఎం. . .అదే విధంగా విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెఫ్ట్‌ ఈ రెండింటినీ కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చామన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరసగా మూడు సంవత్సరాలు నుంచి దేశంలోనే మొదటి స్ధానంలో ఆంధ్రరాష్ట్రం నిలిచిందన్నారు. సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌లో కూడా రాష్ట్రం ఇవాళ టాప్‌ 4,5 స్ధానాల్లో కనిపిస్తుంది.

ఏపీ అభివృద్ధికి అమెరికాలో స్థిరపడిన తెలుగువారి సహాయం కావాలని కోరుతూ ఇవన్నీ చెప్పాల్సి వచ్చిందన్నారు సీఎం.అక్కడ మీరు ఎంతగానో ఎదిగారు.ఇప్పటికే అభివృద్ది చెందిన వెస్ట్రన్‌ వరల్డ్‌లో ఉన్న తెలుగువారు అపారమైన అనుభవంతో రాష్ర్ట అభివృద్ధికి సహకరించాలని సీఎం కోరారు.ఇంకా ఎక్కువగా ఆంధ్రరాష్ట్రం మీద, గ్రామాల మీద ధ్యాస పెట్టగలిగితే ఏపీని అగ్రభాగంలో నిలపగలమని నాటా సభ్యులకు ఫైనల్‌గా విజ్ఞప్తి చేస్తూ నాటా కార్యక్రమంలో పాలుపంచుకొంటున్న అందరికీ మంచి జరగాలని సీఎం అకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version