వాలంటీర్ వ్యవస్థ భవిష్యత్తుపై ఏపీలో నీలినీడలు కమ్ముకుంటున్నాయని అంటున్నారు పలువురు విశ్లేషకులు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వాలంటీర్ల పట్ల మనుస్సు మార్చుకుంటుందా అంటే అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై రాజకీయా వర్గాలు అవుననే అంటున్నాయి. అయితే దీనికి ప్రత్యేక కారణం కూడా ఉందంటున్నారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాలంటీర్లపై రోజుకో మాట వినిపిస్తోంది. వాళ్ళను కొనసాగిస్తామని చెప్తూనే వాళ్ళకు ఉద్వాసన పలికేందుకు పరోక్షంగా ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండునెలలు కూడా గడవకముందే ఈ విధమైన వ్యవహారం వాలంటీర్లను కలవరపాటుకి గురిచేస్తోంది. రోజుకో మలుపు తిరుగుతున్నీ వ్యవహారంపై క్లారిటీ ఇప్పుడిస్తారోనని అటు వాలంటీర్లు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగానే వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి సంచలనం రేపింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారనే ప్రశంసలు కూడా దక్కాయి గత ప్రభుత్వానికి. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాలంటీర్ల వ్యవస్థపై అధికార. ప్రతిపక్షాల నడుమ పెద్ద యుద్ధమే నడిచింది. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తారంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేయగా దానికి టీడీపీ నేతలు సైతం గట్టిగానే కౌంటరిచ్చారు. వైసీపీకి మద్ధతుగా కొందను వాలంటీర్లు అప్పట్లో రాజీనామాలు సమర్పించారు.
దీంతో తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు గౌరవ వేతనం రూ. 10,000 చేస్తామని ఎన్డీఏ కూటమి కూడా ఇచ్చింది. కానీ అధికారంలోక వచ్చిన కూటమి ప్రభుత్వం వాలంటీర్లను ఎలాగైనా పక్కన పెట్టాలనే ఉద్దేశ్యంతో సాకులు వెతుకుతునట్టు కనిపిస్తోంది. గ్రామానికి కేవలం 5 మంది వాలంటీర్లను మాత్రమే తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉందనే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. వాలంటీర్లుగా పనిచేయాలనుకునే వారికి ఫలానా అర్హతలు ఉండాలంటూ ప్రచారాలు కూడా చేసింది. వారికి రెండో నెల జీతం కోసం బిల్లులు పెట్టారంటూ కథనాలు కూడా వచ్చాయి. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందంటూ వాలంటీర్ల సంఘం నాయకులు ఇటీవల ఖండించారు.
వాలంటీర్ల విధి, విధానాలను రూపొందించాక కీలక ప్రకటన చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందనే వార్తలు కూడా నిన్నటి వరకు వినిపించాయి. అయితే ఇప్పుడు వారికి వ్యతిరేకంగా పిడుగులాంటి పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంఘం వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని తీర్మానించింది.
ఈ మేరకు సర్పంచ్‌ల సంఘం గౌరవాధ్యక్షులు రాజేంద్రప్రసాద్ తీర్మానాన్ని వెల్లడించారు. దీంతో వాలంటీర్ వ్యవస్థ ఉండకపోవచ్చనే అనుమానాలు మళ్ళీ మొదలయ్యాయి. ప్రభుత్వమే పరోక్షంగా వాలంటీర్లకు వ్యతిరేకంగా ఇలా చేయిస్తోందా అని కొందరు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సాకులను అడ్డంపెట్టుకుని వాలంటీర్లను పర్మినెంట్‌గా తొలగించే కుట్ర జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. మరి దీనిపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.