టీడీపీలో ఇద్దరు మహిళలు పెద్దాయనకు ఏకు మేకయ్యారా?

-

ఒకప్పుడు ఆయన చెప్పిందే శిలాశాసనంగా భావించేవారు. మారు మాట్లాడేందుకు ఎవరూ సాహసించేవారు కాదు. అలాంటిది ఇప్పుడంతా సీన్ రివర్స్‌. ముఖ్యంగా నలుగురు మహిళలు మాత్రం ఆయనకు చెవిలో జోరీగలా తయారయ్యారట. అశోక్‌ గజపతిరాజు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా ఎన్నికైన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రిగాను పనిచేశారు. టీడీపీలో చంద్రబాబు తర్వాతి స్థానం ఆయనదే అన్నంత ప్రచారం ఉండేది. మొన్నటి ఎన్నికల వరకు ఈ పూసపాటి రాజావారు ఏం చెబితే జిల్లా టీడీపీలో అదే జరిగేది.కానీ ఇప్పుడు సీన్ రివర్సయింది.

మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ గిరి పోయింది. సింహాచలం దేవస్థానం చైర్మన్‌ పోస్ట్‌ కూడా లేదు. ఆయన స్థానంలో ఆనందగజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచైతను నియమించింది ప్రభుత్వం. మాన్సాస్‌ చైర్మన్‌గా సంచైత బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అశోక్‌ గజపతిరాజుకు కష్టాలు మొదలయ్యాయి. సోషల్‌ మీడియా వేదికగా ఆమె అశోక్‌పై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిమధ్య వారసత్వ పోరు కోర్టు మెట్లెక్కింది. ఇదే సమయంలో ఆనందగజపతిరాజు రెండో భార్య కుమార్తె ఉర్మిళ సైతం ఎంట్రీ ఇచ్చారు. తానే అసలైన వారసురాలినని చెబుతున్న ఆమె.. ఆనందగజపతిరాజు చనిపోయాక ఆదుకోవాల్సిన బాబాయ్‌ పట్టించుకోలేదని అశోక్‌గజపతిరాజుపై విమర్శలు చేస్తున్నారు. పూసపాటి రాజవంశ వారసులే ఇలా అశోక్‌కు కంట్లో నలుసుగా మారినట్టు జనాలు చర్చించుకుంటున్నారట.

ఇక టీడీపీలోనే అయినా రాజావారి పరిస్థితి సాఫీగా ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎన్నడూ లేనంత వర్గ పోరు భగ్గుమంది. అశోక్‌ నాయకత్వాన్ని సవాల్‌ చేస్తున్నారు పార్టీ నాయకులు. ఇటీవల పార్టీ పదవులు ప్రకటించడంతో నివురు గప్పిన నిప్పులా ఉన్న నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మాజీ మంత్రి పడాల అరుణ, మాజీ ఎమ్మెల్యే మీసాల గీతలు ఓపెన్‌గానే అశోక్‌గజపతిరాజు తీరుపై విమర్శలు చేస్తున్నారు. సీనియర్లను పక్కనపెట్టి అనుచరులకు పదవులు కట్టబెట్టారని మండిపడుతున్నారు.

మాజీ మంత్రి పడాల అరుణ.. ఏకంగా పార్టీ మారే ఆలోచన చేస్తున్నారట. ఇది స్థానిక టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మాత్రం కొత్తగా టీడీపీ ఆఫీసు తెరిచారు. ఇన్నాళ్లూ అశోక్‌ బంగ్లానే టీడీపీ ఆఫీస్‌గా ఉంటూ వస్తోంది. గీత తీసుకున్న ఈ నిర్ణయం అశోక్‌ గజపతిరాజుకు.. ఆయన వర్గానికి అస్సలు మింగుడుపడటం లేదట. నాలుగు దశాబ్దాలపాటు జిల్లా టీడీపీ రాజకీయాలను ఒంటి చేత్తో నడిపించిన రాజావారికి ఈ ఇద్దరు మహిళా నేతలు ఏకు మేకైనట్టు తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారట.

మొత్తానికి ఇంట్లో ఇద్దరు.. పార్టీలో మరో ఇద్దరు మహిళలు విజయనగరం రాజావారికి చుక్కలు చూపిస్తున్నారని జనం చెవులు కొరుక్కుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version