గెలుపు ఇక్కడ సునాయాసం.. కానీ గెలుపు తరువాత విశ్లేషణలే అతి ముఖ్యం.. కనుక వైసీపీ గెలుపు తరువాత ఆ పార్టీ ఇచ్చిన హామీలు ఏమేరకు ముందున్న కాలంలో అమల్లో ఉంటాయో అన్నది కీలకం. కనుక మాట నెగ్గుకు రావడం, హామీలు నిలబెట్టుకుని రాణించడం అన్నవి ఇప్పటి రాజకీయాన అత్యవసరం అని భావిస్తోంది ప్రజానీకం. ఇవాళ ఆత్మకూరు కథ కూడా ఇదే ! ఈ తరహా నీతినే చివర్లో అంటే ఈ నెల చివర్లో బోధించనుంది. ఎందుకంటే ఫలితం తేలేది అప్పుడే కనుక ! సో.. తుది ఫలితాల కోసం ఈ నెల 26 వరకూ వేచి ఉండాల్సిందే !
ఆత్మకూరులో వైసీపీ గెలుస్తుంది. బీజేపీ పేరు కానీ తీరు కానీ అక్కడ పెద్దగా ప్రస్తావనకు రావడం లేదు. మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఆయన తమ్ముడు విక్రం రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన గెలుపు కూడా సునాయాసమే.!ఇందులో కూడా డౌట్ లేదు. రోజా లాంటి మంత్రులు అక్కడ., కొడాలి నాని లాంటి మాజీ మంత్రులు అక్కడ.. ప్రచారం చేశారు. దీంతో నామినేషన్ వేసిన దగ్గర నుంచి అభ్యర్థిని వాళ్లంతా భుజాలపై పెట్టుకుని ఊరేగారు. అంతగా శ్రమించారు కూడా!
ఇప్పుడు ఎన్నిక జరుగుతున్న వేళ కూడా ము ఖ్య నేతలంతా అక్కడే మోహరించి ఉన్నారు. అన్ని పనులూ మానుకుని అధినేత ఆదేశాలకు అనుగుణంగా ఓటింగ్ ఏవిధంగా జరుగుతుంది అన్నది పరిశీలించేందుకు అక్కడే ఉన్నారు అని సమాచారం. ప్రధాన మీడియా అందిస్తున్న సమాచారం ప్రకారం నియోజకవర్గంలో మొత్తం 279 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇక్కడి గణాంకాల ప్రకారం 2,13,400 మంది ఓటర్లు ఉన్నారు. 363 ఈవీఎం మేషీన్లు 391 వీవీప్యాట్స్ ను వినియోగిస్తూ అభ్యర్థి భవితవ్యాన్ని తేల్చనున్నారు.1409 మంది పోలీసుల పర్యవేక్షణలో ప్రస్తుతానికి ఎటువంటి అలజడులూ లేని రీతిన పోలింగ్ జరుగుతోందని ప్రాథమిక సమాచారం. ఈ నెల 26న ఓట్ల లెక్కింపుతో వైసీపీ ఏ మేరకు అనుకున్న ఫలితాలు సాధించిందో తేలిపోనుంది.