ఏపీ రాజకీయాల్లో టీడీపీ-జనసేనల పొత్తు అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అధికారికంగా ఈ రెండు పార్టీల పొత్తు గురించి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు గానీ…అనధికారికంగా మాత్రం పొత్తు ఫిక్స్ అయినట్లు సమాచారం అందుతుంది. ఈ రెండు పార్టీల పొత్తు దాదాపు ఖాయమని ప్రచారం మొదలైంది. కాకపోతే ఎన్నికల సమయంలో అధికారికంగా పొత్తు ఫిక్స్ అవుతుందని తెలుస్తోంది. కానీ ఈలోపు జనసేనకు ఇచ్చే సీట్ల విషయంలో చంద్రబాబు, టీడీపీ నేతలకు క్లారిటీ ఇచ్చేస్తున్నారట.
ఇలా పలు నియోజకవర్గాల్లో బాబు…జనసేన కోసం ఖాళీలు పెట్టుకుంటూ వెళుతున్నారు. ఉదాహరణకు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఉంది. ఇక్కడ ఏ నేతకు ఇంచార్జ్ పదవి ఇవ్వలేదు. కాకపోతే ఎంపీ కేశినేని నానిని సమన్వయకర్తగా పెట్టారు. అటు భీమవరం సీటులో తోట సీతారామలక్ష్మీకి తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. నర్సాపురం సీటులో కూడా అదే పరిస్తితి. అలాగే కైకలూరు సీటుని కూడా జనసేనకు ఇస్తారని ప్రచారం ఉంది. ఆ సీటులో కూడా టీడీపీ ఇంచార్జ్‌ని ఫిక్స్ చేయలేదు. అటు భీమిలి సీటు కూడా జనసేనకు ఇచ్చేలా ఉన్నారు.
అలాగే విశాఖ నార్త్ సీటు జనసేనకే కేటాయించేలా ఉన్నారు. రాజోలు, అమలాపురం సీట్లు సైతం జనసేనకే దక్కేలా ఉన్నాయి. ఇక తెనాలి సీటులో నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇలా జనసేనకు ఇచ్చే సీట్లలో టీడీపీకి బలమైన నాయకులని పెట్టకుండా బాబు తెలివిగా రాజకీయం చేస్తున్నారు.