టార్గెట్ ఎలక్షన్స్… వైఎస్సార్ కాంగ్రెస్ లో బీసీలకు అధిక ప్రాధాన్యం

-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారాయన. పనితీరు బాగాలేని, వ్యతిరేకతను మూట గట్టుకున్న వారిని నియోజకవర్గ ఇంచార్జ్ లుగా తప్పిస్తున్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కొత్తవారిని నియమిస్తూ ఎలక్షన్ టీమ్ ను సిద్ధం చేసుకుంటున్నారు.అందులో బీసీలకు అధిక ప్రధాన్యమిస్తున్నారు. అందులో భాగంగా 11 నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జ్ లను నియమించారు. మరో రెండు మూడు రోజుల్లో మిగతా చోట్ల కూడా కొత్త వ్యక్తులు ఇంచారుజులుగా కనిపించనున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా 50 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కని పరిస్థితి నెలకొంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వాళ్లకు సైతం టిక్కెట్స్ ఇవ్వడం ద్వారా తెలంగాణాలో కేసీఆర్ ఎలా దెబ్బతిన్నారో గుర్తించిన జగన్ ఇప్పట్నుంచే దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ప్రజామోదం లేనివారికి టిక్కెట్స్ ఇచ్చేది లేదని ఈ ఇంచార్జుల మార్పు ద్వారా స్పష్టం చేస్తున్నారు.అవసరమైతే ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చే ఆలోచనలో కూడా ఉన్నారు జగన్.
175 నియోజకవర్గాల్లో గెలుపే ప్రాతిపదికగా నిర్ణయం తీసుకున్నారు. వైఎసార్సీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలన్నదే లక్ష్యంగా – వైఎస్ జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ఎన్నికలు సమీపించే కొద్దీ ఇంకా పెను మార్పులు ఉంటాయని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు.

ఎన్నికల్లో ఈసారి బీసీలకు అధిక ప్రాధాన్యం దక్కేలా జాగ్రత్త పడుతున్నారు జగన్. అటు టీడీపీ,జనసేన బీసీ మంత్రాన్ని జపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణలో కూడా బీజేపీ ఈ బీసీ నినాదాన్ని గట్టిగా వినిపించింది. అందుకే జగన్ సైతం బీసీలకు పార్టీ నియామకాల్లో ప్రాముఖ్యత కల్పిస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలతో పాటు బీసీలకు కాస్త ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. ఇదంతా చూస్తుంటే జగన్ జెట్ స్పీడులో ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వెనుకబడిన వర్గాలకు మరింత గుర్తింపు, ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో ఇలా ఇంచార్జులుగా నియమించినట్లు చెబుతున్నారు.మొత్తానికి పక్కా ప్రణాళికతో బీసీ ఓట్లను టార్గెట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version