తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగానే అప్పటి ప్రగతి భవన్ ఇప్పుడు జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తోంది. అయితే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఉద్దేశించిన ఈ ప్రజాదర్బార్ కార్యక్రమం పేరును తాజాగా ప్రజావాణిగా మార్చారు. ఈ మేరకు పేరును మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఒక కార్యక్రమంలో ప్రకటించారు.
హైదరాబాద్‌లోని జ్యోతిబా ఫులె ప్రజాభవన్‌లో ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యక్రమంలో మార్పులు చేసినట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఇక నుంచి మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘ప్రజావాణి’లో భాగంగా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని వెల్లడించారు. ఉదయం 10 గంటల లోపు ప్రజాభవన్‌కు చేరుకున్న వారికి ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సూచించారు. దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని.. ప్రజావాణికి వచ్చేవారి సౌకర్యార్థం తాగునీరు, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. భద్రతా సిబ్బంది ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రజలకు అన్ని విధాల సహకరించాలిని చెప్పారు.