తెలంగాణలో బలోపేతమే లక్ష్యంగా బిజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.. ఉన్న బలాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని భావిస్తోంది.. అందుకోసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది.. తెలంగాణాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే మార్చి నాటికి ఖాళీ కాబోతున్నాయి.. ఈ వ్యవహారంలో బిజేపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే మార్చి 29తో ఖాళీ అవుతున్నాయి. ఇందులో రెండు టీచర్ సీట్లు కాగా… ఒకటి పట్టభద్రుల నియోజకవర్గం. వీటిల్లో గెలుపుకోసం కమలనాధులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నారు.. ఆయా నియోజకవర్గాల్లో బిజేపీకి బలముంది.. దీంతో అక్కడ పాగా వేసేందుకు కార్యాచరణ మొదలుపెట్టేసింది.. దీని కోసం ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేసిందట..
ఖమ్మం నల్లగొండ, వరంగల్ టీచర్ స్థానం నుంచి బరిలోకి దింపేందుకు సరైన అభ్యర్దిని కమలనాధులు అన్వేషిస్తున్నారట.. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన వ్యక్తితోపాటు.. సంఘ్ పరివార క్షేత్రం తెలంగాణ ప్రాంతపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేసిన మరో నేత కూడా టిక్కెట్ ప్రయత్నాలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది..దీంతో పార్టీ ఎటూ తెల్చుకోలేకపోతోందని సమాచారం..
నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానం కోసం పార్టీ నేతలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారట. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ , మరో ఇద్దరు నేతలు అధిష్టానం పెద్దల దగ్గర తమ అభ్యర్దిత్వాన్ని పరిశీలించాలని కోరారట.. తమకు మంచి ఫాలోయింగ్ ఉంది.. గెలిచేస్తామంటూ పోటీకి ఆసక్తి చూపుతున్న అభ్యర్దులు చెబుతున్నారని కమలం పార్టీలో చర్చ జరుగుతోంది..
మూడు సీట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరంగా చేస్తున్నారు.. బీజేపీ అధిష్టానం మాత్రం గెలుపు గుర్రాల వైపే మొగ్గుచూపుతోంది.. ఈ మూడు స్థానాల్లో గెలిస్తే.. వచ్చే ఎన్నికల నాటికి మరింత బలం పుంజుకోవచ్చని నేతలు భావిస్తున్నారు.. అభ్యర్దుల ఎంపిక, వారి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయో చూడాలి..