కన్నా లక్ష్మీనారాయణ తెలుగు రాజకీయాల్లో సీనియర్ నేత.. మాజీ మంత్రి… వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరేందుకు రెడీ అవుతోన్న క్రమంలో అనూహ్యంగా ట్విస్ట్ ఇచ్చి ఆయన బీజేపీలో చేరడం.. ఆయన్ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించడం చకచకా జరిగిపోయాయి. ఎన్నికలకు ముందు ఏపీ బీజేపీ వ్యవహారాలు అన్ని కన్నా కనుసన్నల్లోనే కొనసాగాయి.
కట్ చేస్తే ఎన్నికలు అయిపోయాయి. నాలుగు నెలల్లోనే బీజేపీలో కన్నా లక్ష్మినారాయణ పని కరివేపాకులా ఉందని టాక్ వినిపిస్తూ ఉంది. ఏపీ బీజేపీ వ్యవహారాలు ఏవీ కన్నా లక్ష్మినారాయణ చెప్పుచేతల్లో లేవన్నది సగటు రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిపోతోంది. ఎన్నికలు అయ్యాక టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలు అయిన సుజనా చౌదరి & గ్యాంగ్ ఒక వైపు, మరోవైపు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి టీం మరో వైపు ఏపీ బీజేపీ వ్యవహారాలను కంట్రోల్ చేసేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ రెండు వర్గాలు బీజేపీ వ్యవహారాలను డామినేట్ చేస్తూ ఏపీ బీజేపీని తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పురందేశ్వరి 2014 ఎన్నికలకు ముందే బీజేపీలో చేరడంతో ఆమె కేంద్ర మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక సుజనా చౌదరి సైతం మళ్లీ తన రాజ్యసభ రెన్యువల్‌తో పాటు మళ్లీ కేంద్ర మంత్రి పదవి రాదా ? అని తన వంతుగా తాను గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సీఎం రమేష్ సైతం రాజ్యసభ రెన్యువల్, మంత్రి పదవి కోసం ఆశతోనే ఉన్నారు.
ఈ క్రెడిట్ వార్‌లో సోము వీర్రాజు, పైడికొండల లాంటి నేతలు కూడా కనుమరుగై పోతున్నారు. ఇక కన్నా సైతం పేరుకే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ఆయన్ను ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదు. అసలు ఇప్పుడు ఎవరు పార్టీలో చేరాలన్న ఢిల్లీ డైరెక్షన్లో నడుస్తోందట. ఇక రాం మాధవ్ డామినేషన్ ఎక్కువ కావడంతో కన్నా లాంటి వాళ్లను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఏదేమైనా కన్నా సీనియార్టీకి పార్టీలో ఎంత మాత్రం ప్రయార్టీ లేదని ఆయన సైతం బాధపడుతున్నట్టు తెలుస్తోంది.