జగన్ కేబినెట్‌లో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ విషయం లేకుండా మాట్లాడరు. ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా.. అంతో ఇంతో విషయం గ్యారెంటీ..అనే టాక్ ఉంది. ఇక, ఆ విషయం పట్టుకు ని ఓ నాలుగు రోజులు మీడియా కథనాలు అల్లేయడమూ కనిపిస్తున్న విషయమే!గతంలో రాజధాని విషయంలో స్పందించిన బొత్స.. మీడియాకు వరుస కథనాలు అందించి.. వారం పదిరోజులు పండగ చేశారు. తాజాగా కూడా బొత్స ఇలాంటి ఫీడే సోషల్ మీడియాకు, సైట్లకు ఇచ్చేశారు.
ఇటీవల రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు వివిధ అంశాలపై తీవ్రస్థాయిలో విజృంభించారు. నెల్లూరు నుంచి విశాఖ వరకు చాలా మంది సీనియర్ నేతలు పాలనపై నిప్పులు చెరిగారనే చెప్పాలి. తమ నియోజక వర్గాన్ని అసలు ఏపీ నుంచి తొలగించారని ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. ఇలా అయితే, పోరాటాలకు దిగాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. ఇక, గుంటూరు నుంచి వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా ఇదేతరహా వ్యాఖ్యలు చేశారు. ఇంత సీరియస్ కాకపోయినా.. ఆయన కూడా ఇలానే మాట్లాడారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై ఇప్పటి వరకుప్రభుత్వం నుంచి అధికారికంగా ఎవరూ స్పందించలేదు. అయితే, ప్రతిపక్షం వీరి వ్యాఖ్యలను అడ్వాంటేజ్‌గా తీసుకుంటుందని భావించారో ఏమో.. మంత్రి బొత్స తనదైన శైలిలో స్పందించారు. `ఇది కామన్` అని సింపుల్‌గా తేల్చేశారు. అంతేకాదు, అధికారులు మాట వినకపో తే.. ఇలాంటి అసంతృప్తి కామన్ అని, దీనిని అసమ్మతిగా చూడరాదని విపక్షాలకు చురకలంటించే ప్రయత్నం చేశారు. అయితే, బొత్స చేసిన కామెంట్లలో అసమ్మతి లేదనేది నిజమే అయినా.. అసంతృప్తి మాత్రం నిజమేనని అంటున్నారు విశ్లేషకులు.
అయితే, ఆ అసంతృప్తి ఎవరిపై? బొత్స చెబుతున్నట్టు అధికారులపైనా? లేక.. నేరుగా ప్రభుత్వంపైనా? అనేది మాత్రం అందరికీ తెలుసునని, కానీ, బొత్సకు మాత్రం తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. విషయం ఇంత క్లారిటీగా ఉన్నప్పటికీ.. బొత్స ఏమీలేదన్నట్టు మాట్లాడి మరో వివాదానికి తెరదీసే ప్రయత్నం చేస్తున్నారనే వాదన కూడా విశ్లేషకుల నుంచి వినిపిస్తుండడం గమనార్హం.