తెలంగాణలో మళ్ళీ బీఆర్‌ఎస్‌దే అధికారం-తేల్చేసిన PRISM

-

తెలంగాణలో ఏ సర్వే చూసినా అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ కే అనుకూల ఫలితాలు వస్తున్నాయి. తాజాగా PRISM అనే సంస్థ చేపట్టిన సర్వేలోనూ ఆ పార్టీకే అనుకూల ఫలితాలు వచ్చాయి.ఇప్పటి వరకు డిజిటల్‌ ప్రచారాలకు పరిమితమైన ఈ సంస్థ తాజాగా ఎన్నికల సర్వేలను కూడా చేస్తోంది.తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ఈ సంస్థ ప్రయోగాత్మకంగా ఓ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు 70 నుంచి 76 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని తేల్చేసింది.సంక్షేమ పథకాల అమలు,కేసీఆర్‌-కేటిఆర్‌ పాపులారిటీ వెరిసి ఈసారి కూడా ఆ పార్టీ ఇక్కడ గెలిచి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్‌ కొడుతుందని సర్వే చెబుతోంది.

 

ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు,మంత్రి కేటిఆర్‌ రాష్ర్టంలోని అన్ని నియోజకవర్గాలు చుట్టేస్తున్నారు. తెలంగాణ యాసలో వారు చేస్తున్న ప్రసంగాలు పబ్లిక్‌లో విపరీతమైన క్రేజ్‌ తీసుకువస్తున్నాయి. అలాగే ఐదేళ్ళలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందడంతో పాటు పరిపాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఈ సంస్థ చెబుతోంది. సంక్షేమ పథకాల కారణంగా మహిళలు మరియు వృద్ధుల వంటి కీలకమైన ఓటర్లు బీఆర్‌ఎస్‌కే జైకొడుతున్నారు.
ఉద్యోగాల కల్పనతో నిరుద్యోగులు, దళిత బంధుతో రాష్ర్టంలోని దళిత సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌కి మద్ధతు లభిస్తోంది. ప్రణాళిక ప్రకారం సంక్షేమ ఫలాలు అందడం వలన అసంతృప్తులు చాలా వరకు తగ్గిపోయారు.దీంతో వారంతా బీఆర్‌ఎస్‌ పట్ల సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

ఇప్పటివరకు జరిగిన వివిధ రకాల సర్వేల్లో కాంగ్రెస్‌ పార్టీకి రెండో స్థానం దక్కింది.ఇప్పుడు PRISM సంస్థ చేపట్టిన సర్వేలోనూ కాంగ్రెస్‌ పార్టీ ఆశ్చర్యకరంగా రెండో స్థానంలోనే నిలిచింది. ఓటు షేరులో గతం కంటే ఎక్కువ శాతాన్ని కాంగ్రెస్‌ ఈ సారి పొందనుంది.6 హామీలతో ప్రజల్లోకి వెళ్ళిన కాంగ్రెస్‌కి 34-39 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని తేల్చేసింది ఈ సంస్థ. కర్నాటకలో గెలుపుతో ఊపుమీదున్న కాంగ్రెస్‌ తెలంగాణలోనూ పాగా వేయగలదని ఆపార్టీ నాయకులు ప్రచారంలో దూకుడు పెంచినప్పటికీ సర్వేల్లో మాత్రం రెండో స్థానానికే పరిమితం కావడం కలవరపాటుకి గురిచేస్తోంది.పార్టీలో నెలకొన్న అంతర్గత వివాదాలు, బలమైన నాయకత్వం లేకపోవడం కూడా ఆ పార్టీకి శాపంగా మారుతున్నాయి.

2018 ఫలితాలతో పోలిస్తే ఒకటి లేదా రెండు సీట్లను బీజేపీ పెంచుకుంటుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. కేవలం 3-4 సీట్లు మాత్రమే బీజేపీ సాధిస్తుందని కుండబద్దలు కొట్టింది. అయితే ఓటు షేరు మాత్రం గతంలో కంటే మెరుగ్గా ఉంటుందని సమాచారం.రాజకీయ వ్యూహాల్లో వెనుకబడటం,ప్రజల నాడిని పట్టుకోవడంలో వైఫల్యం,బలమైన నేతలు లేకపోవడం వంటి అంశాలు భారతీయ జనతా పార్టీకి ప్రతికూల ఫలితాలు తెస్తాయని ఈ సర్వే వెల్లడించింది. AIMIM హైదరాబాద్‌లో 7 సీట్లను తిరిగి పొందే అవకాశం ఉంది. జూబిలీ హిల్స్‌లో ఆ పార్టీ నేత గెలిచే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రిజమ్‌ సంస్థ తేల్చింది. కేవలం 5 నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి పోటీ ఎదురవుతుందని,మిగతా ప్రాంతాల్లో సునాయాసంగా గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ప్రిజమ్‌ సంస్థ అంచనా వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version