ఏ పార్టీకైనా కార్యకర్తలు నేతలే బలం.. వారు కష్టపడితేనే పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఈ విషయం అన్ని రాజకీయ పార్టీ నేతలకు బాగా తెలుసు కాబట్టి కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడానికి కారణం కూడా కార్యకర్తలే.. ఐదేళ్లపాటు వైసీపీ హయాంలో ఇబ్బందులు పడ్డ కార్యకర్తలను అక్కున చేర్చుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారట.. పొలిట్ బ్యూరో సభ్యులు నిత్యం రాష్ట్రంలో ఉండే నేతలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని ప్రచారం పార్టీలో నడుస్తోంది..
వారంలో ఒక్క రోజైనా.. నేతలకు ఎమ్మెల్యేలకు జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట.. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం వెనక పెద్ద కారణమే ఉందని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది.. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వందల కోట్ల సంక్షేమ పథకాలు అందించారని.. అయితే కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు ఆయన అందుబాటులో లేకపోవడమే ఆయన ఓటమికి కారణమని చంద్రబాబు భావిస్తున్నారట.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కార్యకర్తల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా ఎవరికీ అయిన అపాయింట్మెంట్ ఇవ్వలేదని.. అందువల్లే గత ఎన్నికల్లో కార్యకర్తలు ఆశించిన స్థాయిలో ఆ పార్టీకి సహకరించలేదని టిడిపి అధినేత భావిస్తున్నారని చర్చ నడుస్తోంది.. ఈ నేపథ్యంలోనే పరిపాలన వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. క్యాడర్ కు అందుబాటులో ఉండేలా ఆయన ప్లాన్ రూపొందించుకుంటున్నారనే చర్చ టిడిపిలో నడుస్తోంది..
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తల వినతులను స్వీకరించేందుకు ఇటీవల ఆయన కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.. దివ్యాంగులతో పాటు సామాన్య కార్యకర్తల నుంచి ఆయన అర్జీలు స్వీకరించి వారితో మాట్లాడారు.. ఇదంతా కూడా కార్యకర్తలకు మరింత చేరువయ్యేందుకు చంద్రబాబు తీసుకుంటున్న జాగ్రత్తలు అని సమాచారం.. చంద్రబాబు నాయుడే కాకుండా ఎమ్మెల్యేలు మంత్రులు పొలిట్ బ్యూరో సభ్యులు కూడా జిల్లా పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని కేడర్ కు అందుబాటులో ఉండాలని అంతర్గత సమావేశంలో చంద్రబాబు సూచించారట.. వారికి దూరం అవడం వల్లే గతంలో ఎన్నోసార్లు చావు దెబ్బలు తిన్నామని.. ఈసారి వచ్చిన అవకాశాన్ని ఎవరూ కూడా చేజార్చుకోవద్దంటూ నేతలకు చంద్రబాబు చెబుతున్నారట.. మొత్తంగా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు భావించడం శుభ పరిణామం అని టిడిపి క్యాడర్ చెబుతుంది..