నాలుగోసారి మాట నిలుపుకున్న సీఎం జగన్

-

అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే ధ్యేయంగా.. నా డ్వాక్రా అక్క చెల్లెమ్మలను నిజమైన వ్యాపార వేత్తలుగా మార్చాలనే లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని మరోసారి నిరూపించుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే సున్నా వడ్డీ స్కీం అమల్లో ఉంది. పేద అక్కా చెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత కల్పించి, వారు చేస్తున్న వ్యాపారాలకు ఊతమిచ్చేలా సున్నావడ్డీకే రుణాలు అందించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరడమే లక్ష్యమని ఎన్నికల ముందు ప్రకటించిన జగన్ అధికారంలోకి వచ్చాక ఆ హామీని నెరవేరుస్తున్నారు. వరుసగా నాలుగోసారి మహిళల ఖాతాల్లో సున్నా వడ్డీని జమ చేశారు సీఎం. అమలాపురంలో జరిగిన కార్యక్రమంలో బట్టన్ నొక్కి నిధులను విడుదల చేశారు.9.48 లక్షల డ్వాక్రా సంఘాల్లోని 1,05,13, 365 మంది లబ్ధిదారులు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీ నిధులను రీయింబర్స్మెంట్ చేశారు.

సభలో మాట్లాడిన సీఎం…. బహుళ జాతి, దిగ్గజ కంపెనీలు, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంటున్నారని చెప్పారు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ వంటి పథకాలతో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. ప్రభుత్వం చొరవతో బ్యాంకులలో వడ్డీ రేట్లు తగ్గింపజేయడంతో అక్కచెల్లెమ్మలపై ఏకంగా రూ. 1,224 కోట్ల మేర వడ్డీ భారం తగ్గిందని సీఎం తెలిపారు. ప్రభుత్వ సహకారంతో పశువుల కొనుగోలు, కిరాణా దుకాణాలు, వస్త్ర వ్యాపారాల వంటి వివిధ వ్యాపారాలు చేసుకుంటున్న 16,44,029 మంది అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.7 వేల నుంచి 10 వేల వరకు అదనపు ఆదాయం పెరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు సీఎం జగన్.చంద్రబాబు అధికారంలో ఉన్న రోజుల్లో ఇన్ని సంక్షేమ పథకాలు పక్కాగా అమలు కావడం ఎప్పుడైనా చూశారా? ఇన్ని డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఎప్పుడైనా ఇచ్చారా? అని సీఎం జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబు మహిళల భవిష్యత్తు కోసం ఎప్పుడైనా ఆలోచన చేశారా అని అన్నారు. అదే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పేద బిడ్డల కోసం ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలు చేస్తానంటే చంద్రబాబు దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని సీఎం జగన్‌ విమర్శించారు. ఏనాడైనా ఇంత మందికి చంద్రబాబు ఇళ్ల పట్టాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఈ ముసలాయన పేరు వింటే.. ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా అని చంద్రబాబు ను ఉద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడగా.. సభలో ఉన్న ప్రజలు పెద్దఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

ఎన్నికల సమీపిస్తుండటంతో రానున్న రోజుల్లో చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అధికారం కోసం అబద్దాలు చాలా చెబుతారని, ఎవరూ మోసపోవద్దని సీఎం జగన్‌ సూచించారు. దత్తపుత్రుడు ఎలాగైనా చంద్రబాబును సీఎం చేయాలని తప్పుడు ఆరోపపణలు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని చెప్తూ వారికి అధికారం ఇస్తే.. గిట్టనివారి అంతుచూస్తారట అని వ్యంగ్యంగా విమర్శలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అప్పులు కూడా గతం కంటే తక్కువగానే తెస్తోందని, టీడీపీ హయాంలో ఇంతకంటే ఎక్కువ అప్పులు తెచ్చి చంద్రబాబు ఆనాడు ఎందుకు ఇన్ని పథకాలు ఇవ్వలేకపోయారనే ఒక్క ప్రశ్నకు ప్రజలకు సమాధానం చెప్పాలని సీఎం జగన్‌ సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version