మరో రెండు పధకాల అమలుపై రేవంత్ కసరత్తు

-

లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరో రెండు పధకాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఆరు గ్యారంటీలలో ఇప్పటికే రెండు పథకాలను అమలు చేసి జనాదరణ పొందింది.ఇక మరో రెండు అమల్లోకి వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించవచ్చని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు వంటివి విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో తాజాగా రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌,మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థికసాయం అందించే పథకాన్ని అమలు చేయాలనే ప్రణాళిక సిద్ధం చేస్తోంది రేవంత్ సర్కారు.

దావోస్ పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్‌ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. మహా లక్ష్మి హామీలో భాగమైన ఈ రెండు పథకాలను అమల్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో కలిపి రూ. 500 ఎల్పీజీ సిలిండర్‌ కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో, మొత్తం 91.49 లక్షల మంది మహిళలు రూ. 500 ధర కలిగిన సబ్సిడీ ఎల్‌పిజి సిలిండర్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.అలాగే ప్రజాపాలనలో మొత్తం 92.23 లక్షల మంది నెలకు రూ. 2500 ఆర్థిక సాయానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు. ఇతర పథకాలతో పోల్చితే గ్యాస్‌ సబ్సిడీ, మహిళలకు ఆర్థిక సహాయంకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాకముందే మహాలక్ష్మి పథకంలోని రెండు భాగాలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు పథకం ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుందో మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సాయం, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌ అంతే ప్రాదాన్యంగా నిలిచింది. ఉచిత బస్సు పథకాన్ని ఇప్పటికే విజయవంతంగా కొనసాగిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజాగా మరో రెండు పథకాలను అమలు చేసేందుకు రంగంలోకి దిగడంతో లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version