తెలంగాణలో త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేత, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని గులాబీ నేతలు చెబుతున్నారు. ఈ సమావేశాల్లో రేవంత్ సర్కార్‌కు కేసీఆర్ చుక్కలు చూపిస్తారని ప్రచారం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని, అసెంబ్లీలో ఈ అంశంపై కేసీఆర్ తన వాగ్ధాటితో రేవంత్ సర్కార్‌ను ఎండగతారని గులాబీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే… కేసీఆర్ వ్యూహానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రతి వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించేలా ప్రోగ్రెస్ రిపోర్టు తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన హామీలు, పెండింగ్ హామీల అమలు కోసం జరుగుతున్న కసరత్తు గురించి అసెంబ్లీ వేదికగానే వివరించి కేసీఆర్‌కు షాక్ ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు.
ఇక తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ సారథ్యంలోని బీఆర్‌ఎస్ సర్కార్ వైఫల్యాలను సైతం అసెంబ్లీ వేదికగానే ఎడగట్టేందుకు రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ప్రజలకు ఇచ్చిన హామీలు.. నెవర్చేకుండా ఉన్న హామీలు.. నిధుల దుర్వినియోగం, అక్రమాలు, అవినీతికి సంబంధించిన రిపోర్టు కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
ఇదే సమయంలో… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆరునెలల్లో చేసిన పనులకు సంబంధించి శ్వేతపత్రాన్ని కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే రిలీజ్ చేయాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలు చేస్తున్న తీరు, ప్రజలకు కలుగుతున్న లబ్ధి తదితర వివరాలు ఈ శ్వేతపత్రంలో ఉంటాయని తెలుస్తోంది. ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి వచ్చే కేసీఆర్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పూర్తిగా డిఫెన్స్‌లో పడేసేలా రేవంత్‌రెడ్డి వ్యూహ రచన చేస్తున్నట్లు తెలిసింది.