రేవంత్ దూకుడు..ప్రియాంక ఎంట్రీ..కాంగ్రెస్‌కు పట్టు!

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కాస్త చల్లారినట్లు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి దిగ్విజయ్ సింగ్ వచ్చి పరిస్తితులని చక్కదిద్దడం..అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా మాణిక్కం ఠాగూర్‌ని తప్పించి..మాణిక్ రావు ఠాక్రేని నియమించడం..ఆయన సైతం అందరిని కలుపుకుంటూ ముందుకెళ్లడం..పార్టీకి దూరంగా ఉంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారిని సైతం గాంధీ భవన్‌కు వచ్చేలా చేశారు. అలాగే గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి కలిసి మాట్లాడటంతో కాస్త విభేదాలు తగ్గినట్లే కనిపించాయి.

దీంతో నేతలంతా ఇప్పుడు ఎవరి నియోజకవర్గాల్లో వారు పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకెళుతున్నారు. రేవంత్ రెడ్డి సైతం తన సొంత స్థానం కొడంగల్ లో పర్యటిస్తూ…దూకుడుగా ముందుకెళుతున్నారు. పలువురు బి‌ఆర్‌ఎస్ నేతలని కాంగ్రెస్ వైపు తీసుకొస్తున్నారు. ఇక బి‌ఆర్‌ఎస్ పార్టీపై విమర్శల బాణాలు ఎక్కు పెట్టారు. ఇందిరమ్మ ఇళ్లులేని గ్రామాల్లో తాము ఓట్లడగమని, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు లేనిచోట మీరూ ఓట్లడగొద్దు… డ్రామారావూ అంటూ కేటీఆర్‌ని ఉద్దేశించి సవాల్ చేశారు.

మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ కొడంగల్‌ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటామని ప్రగల్భాలు పలికి.. ఓట్లు దండుకొని పత్తా లేకుండా పారిపోయారని విరుచుకుపడ్డారు. ఇంకా పలు సమస్యలపై రేవంత్ గళం విప్పారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ బలం మరింత పెంచడానికి ప్రియాంక గాంధీ తెలంగాణలో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 6న మొదలుకానున్న హథ్ సే హథ్ పాదయాత్రలో ఆమె పాల్గొనున్నారు.

ఇప్పటికే పాదయాత్రలో పాల్గొనాలని రాష్ట్ర పి‌సి‌సి నుంచి ఆమెకు ఆహ్వానం పంపినట్లు తెలిసింది. ప్రియాంక సైతం తెలంగాణ రావడానికి ఆసక్తిగా ఉన్నారని తెలిసింది. అదే సమయంలో ప్రియాంకని తెలంగాణలో పోటీ చేసేలా ఒప్పించడానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉన్న ఏదొక పార్లమెంట్ స్థానలో ప్రియాంకని పోటీకి దింపాలని భావిస్తున్నారట. మొత్తానికైతే రాష్ట్రానికి ప్రియాంక వస్తే కాంగ్రెస్ పార్టీకి కాస్త బలం పెరుగుతుందని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version