సీనియర్ హీరోయిన్ విజయశాంతి కొద్ది రోజులుగా పార్టీ మారుపోతున్నారన్న వార్త తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లోనూ పట్టుబట్టి మరీ చివరి క్షణంలో సీటు దక్కించుకున్న ఆమె వరుసగా ఓడిపోతు వస్తున్నారు. ఆమెకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ హోదా ఇచ్చినా ఆమె వల్ల ఉపయోగం లేదన్న విమర్శలు ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఇక కొద్ది రోజులుగా ఆమె బీజేపీలోకి వెళ్లిపోతున్నారంటూ వస్తోన్న వార్తలపై తీవ్రంగా స్పందించారు.
గాంధీభవన్ వేదికగా తనపై కొందరు కాంగ్రెస్ నేతలే కుట్ర చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. గాంధీభవన్‌లో తనపై కొందరు కావాలనే కొత్త కుట్రకు తెరలేపారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌ను వీడతానన్న ప్రచారం కూడా గాంధీభవన్ నుంచే ప్రారంభమైందన్నారు. ఈ వార్తలను ఆమె ఖండించారు. ఈ ప్రచారం ఎందుకు వస్తోందని తాను టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కూడా చర్చించానన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ తాను బీజేపీలో చేరనని.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని కూడా విజయశాంతి స్పష్టం చేశారు. రాజకీయాల్లో తాను గతంలోలా ఎలాంటి హడావిడి నిర్ణయాలు తీసుకోనని… తాను పార్టీ మారాలనుకుంటే బహిరంగంగానే ప్రకటిస్తానంటూ స్పష్టం చేశారు.ఇక కొద్ది రోజులుగా కాంగ్రెస్ తీసుకుంటోన్న నిర్ణయాలు నచ్చకే ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని.. ఆమె బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
ఇక విజయశాంతి దశాబ్ద కాలానికి పైగా గ్యాప్ తీసుకుని ఇప్పుడు వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నారు. 14ఏళ్లు విరామం అనంతరం ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనబడనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఈ లేడీ సూపర్ స్టార్ మెడికల్ ప్రొఫెసర్ గా కనిపించనుందట. సినిమాలో ఆమె ఎంట్రీ కూడా చాలా ఇంటెన్స్ గా ఉంటుందని చెబుతున్నారు.