చాలా వరకు మనకు అందుబాటులో ఉన్న సౌందర్య సాధన ఉత్పత్తుల్లో టీ ట్రీ ఆయిల్‌ను కూడా ఉపయోగిస్తుంటారు. కాకపోతే దీన్ని నేరుగా ఎవరూ కొనుగోలు చేసి వాడరు. కానీ మనకు ఈ ఆయిల్ కూడా మార్కెట్‌లో లభిస్తుంది. దీంతో మనకు అనేక లాభాలు కలుగుతాయి. పలు చర్మ సమస్యలను నయం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే టీ ట్రీ ఆయిల్ వల్ల మనకు కలిగే ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. పొడి చర్మం ఉన్నవారు, చర్మంపై దురద, ఇరిటేషన్ వచ్చేవారు టీ ట్రీ ఆయిల్‌ను రాయాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. తేమగా ఉంటుంది. ఆయా సమస్యలు పోతాయి.
2. గాయాలు, పుండ్లు అయిన వారు వాటిపై టీ ట్రీ ఆయిల్‌ను రాస్తే అవి త్వరగా తగ్గుముఖం పడతాయి. టీ ట్రీ ఆయిల్‌లో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు గాయాలు, పుండ్లను మానుస్తాయి.
3. చర్మం కందినా, వాపులకు గురైనా, నొప్పి కలిగినా, ఎరుపు రంగులోకి మారినా ఆ ప్రదేశంలో టీ ట్రీ ఆయిల్‌ను రాస్తే ఫలితం ఉంటుంది.
4. గజ్జి, తామర, దురద వంటి చర్మ సమస్యలకు టీ ట్రీ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది. సంబంధిత ప్రదేశంలో ఈ ఆయిల్‌ను తరచూ రాస్తుంటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. టీ ట్రీ ఆయిల్‌లో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు గజ్జి, తామరల నుంచి రక్షిస్తాయి.
5. పురుషులు షేవింగ్ చేసుకున్నాక చర్మం కట్ అయినా, దురదలు వచ్చినా కొద్దిగా టీ ట్రీ ఆయిల్‌ను తీసుకుని సంబంధిత ప్రదేశంలో రాస్తే ఫలితం ఉంటుంది.
6. వేడి గుల్లలు వచ్చిన వారు వాటిపై టీ ట్రీ ఆయిల్‌ను రాస్తే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.