ఎంపీ అంటే.. సుమారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రజాప్రతినిధి. రాష్ట్ర సమస్యలను జాతీయస్థాయిలో లేవనెత్తే వ్యక్తి. ఏపీ టు హస్తిన ఎక్కడికి వెళ్లినా… అధికారుల రాచమర్యాదలు, గౌరవాలు, ప్రొటోకాల్… ఆ లెక్కే వేరు! కానీ ప్రస్తుతం ఏపీలో ఆ దర్పం కనుమరుగయ్యింది. ఎంపీలంటే ఎవరికీ లెక్కలేకుండా పోయింది! అది ఎంతలా అంటే…
రాజమండ్రి, అనంతపురం, హిందూపురం, బాపట్ల, నరసరావుపేట, విశాఖ, విజయనగరం, కడప, నెల్లూరు, ఒంగోలు, మచిలీపట్నం, నరసాపురం, ఏలూరు ఇలా.. సుమారు 20 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీలనే రాజకీయం జరుగుతుందంట. వీరిలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు సంగతి కాసేపు పక్కనపెడితే… రాజమండ్రిలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ రగడ రోడ్డున పడింది.
వైసీపీ అధికారం చేపట్టి కేవలం రెండున్నరేళ్లే అయింది. అంటే ముందస్తు మాటలేకపోతే… మరో రెండున్నరేళ్ల వరకూ ఎన్నికలు లేవు. ఈ క్రమంలో అభివృద్ధి చేయాల్సిన అవసరం. బాధ్యత ఎంతో ఉంది. ఈ విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిదులను తీసుకురావాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఎంతుందో… కేంద్రం నుంచి నిధులు సమకూర్చాల్సిన బధ్యత ఎంపీలపై కూడా అంతే ఉంది! అంటే… నిధులు – అభివృద్ధి అనే బండికి ఈ వీరిద్దారూ చక్రాలు అన్న మాట!
మరి ఈ జోడెద్దుల బండిలో ఒకటి అటు లాగితే.. ఒకటి అమెరికాలో ఉంటుంటే.. మరొకటి సైడుకు పోతుంటే.. ఇంకొకరు అసలు జిల్లాలోనే లేకుండా పోతుంటే.. మరికరు వ్యాపారాల్లో బిజీగా ఉంటే.. ఎలా? ఇక ఎమ్మెల్యేల విషయానికొస్తే… ఎంపీలను తమ నియోజకవర్గానికి రావొద్దని అల్టిమేటం జారీ చేసే సాహసాలు కూడా ఎమ్మెల్యేలు చేస్తున్న పరిస్థితి.
రాష్ట్ర ఖజానాలో ఎలాగూ సొమ్ము లేదు.. అలాంటప్పుడు ప్రతీ ఎమ్మెల్యే – ఎంపీలతో సఖ్యతగా ఉంటూ, ఎంపీ ఫండ్స్ నుంచి వారి వారి నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలి. ఫలితంగా ప్రజలకు ఉపయోగపడూతూ.. పార్టీకి ప్లస్ అవ్వాలి. అంతేకానీ… ఇలా ఎవరికి వారు ఒంటెద్దుపోకడలకు పోవడం వల్ల… నేతలకు కాదు – పార్టీకి పరిపూర్ణ నష్టం అని.. వైకాపా నేతలు గ్రహించాలి.
అలాకానిపక్షంలో… కంటికి కనిపిస్తున్న ఈ సమస్య – కంటికి కనిపించని వైరస్ లా గ్రౌండ్ లెవెల్లో వ్యాపించే ప్రమాధం ఉంది!