ట్రెండ్ ఇన్ : న‌ల‌భై ఏళ్ల త‌రువాత యువ‌త గుర్తుకు వ‌చ్చారా ?

-

ఎముకలు కుళ్లిన వ‌య‌స్సు మళ్లిన సోమ‌రులారా చావండి అని అరిచాడు శ్రీ‌శ్రీ. ఆ విధంగా అరిచి త‌న పేరును సాహిత్య లోకంలో స్థిరం చేసుకున్నాడు శ్రీ‌శ్రీ. తాజాగా అవే మాట‌లు ఇవాళ ఎందుక‌నో గుర్తుకువ‌స్తున్నాయి. రాజ‌కీయాల్లోకి యువ‌త రావాలి అన్న ఆశ ఒక‌టి ఇవాళ అంద‌రిలోనూ క‌నిపిస్తుంది. బాగా చ‌దువుకున్న వాళ్లే రావాలి అన్న నియ‌మం కూడా ఒక‌టి ఉంది. ఎందుకంటే చ‌దువుకున్న వాళ్లు ఇటుగా అడుగులు వేస్తే వాళ్లంతా బూతులు మాట్లాడ‌రు. ఏదిప‌డితే అది మాట్లాడ‌రు. గుట్కా నోట్లో పెట్టుకుని ఒంట్లో సారాయి నింపుకుని ఏదో ప‌డితే అది మాట్లాడ‌రు. ముఖ్యంగా చదువుకున్న‌వారే ఎందుకు రావాలంటే వారుంటే కాస్త ప్ర‌గ‌తి కనిపించేందుకు, అధికారుల‌ను క‌లిసి క‌నీసం ప్రొసిజ‌ర్ ను వివ‌రించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది క‌నుక !

ఇటీవ‌ల కాలంలో వ‌స్తున్న మార్పు ఏంటంటే రాజ‌కీయ నాయ‌కులంతా బాగా చ‌దువుకున్న వారిని ప్రోత్స‌హిస్తున్నారు. అదేవిధంగా వారిని గౌర‌విస్తున్నారు. అందుకు చాలా మంది ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నారు.ఒక‌ప్ప‌టిలా డిగ్రీలు పూర్తి చేస్తే కాదు డిజిట‌ల్ నాలెడ్జ్ కూడా ఇవాళ ఎంతో అవ‌స‌రం. గ్లోబ‌ల్ ఛేంజెస్ పై అవ‌గాహ‌న అవ‌స‌రం. పెట్టుబ‌డులు ర‌ప్పించే క్ర‌మంలో వివిధ దేశాల ప్ర‌తినిధుల‌తో మాట్లాడేవారు అవ‌స‌రం. చ‌ట్టాల విలువ తెలిసిన వారు అవ‌స‌రం. అందుకే రాజ‌కీయాల్లోకి యువ‌త రావాల‌ని,ఎక్క‌డో ఉండి ప్ర‌సంగాలు ఇవ్వ‌డం కాద‌ని నిన్న‌టి వేళ చంద్ర‌బాబు అన్నారు. అవును !ఆ రోజు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్పుడు కూడా యువ‌కులే ఎక్కువ‌గా వెళ్లి చేరారు. అనామ‌క నాయ‌కులు అంతా త‌రువాత కాలంలో మంత్రి ప‌ద‌వులు అందుకుని స‌త్తా చాటారు. ఏ మాట‌కు ఆ మాట యువ‌కులే ఏ పార్టీకి అయినా శ‌క్తి.

ఈ నేప‌థ్యంలో చాలా రోజుల త‌రువాత టీడీపీ అధినేత‌కు యువ‌త గుర్తుకువ‌చ్చారు. వారికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గొప్ప ప్రాధాన్యం ఇస్తామని అంటున్నారు. పొత్తులు అన్న‌వి తేల‌కుండానే ఎలా న‌ల‌భై శాతం సీట్లు ఇస్తారో అన్న‌ది ఇప్పుడు రేగుతున్న సందేహం.పొత్తుల‌లో భాగంగా ఇచ్చినా కూడా వారంతా స‌మ‌ర్థులే అన్నది ఎలా తేలుతుంది? గ‌తంలో జ‌న‌సేన కొత్త ముఖాల‌కు టిక్కెట్లు ఇచ్చినా కూడా శ్రీ‌కాకుళం జిల్లా పాత‌ప‌ట్నంలాంటి ప్రాంతాల‌లో సీనియ‌ర్ పొలిటిష‌న్ల ధాటికి ఆ కుర్రాడు నిల‌బ‌డ‌లేక‌పోయాడు. క‌నుక పార్టీల నాయ‌క‌త్వ మ‌ద్ద‌తుతో పాటు ఆర్థికంగా వారికి అండాదండా అందిస్తేనే మెరుగుయిన ఫ‌లితాలు వ‌స్తాయి అన్న‌ది నిర్వివాదాంశం.

Read more RELATED
Recommended to you

Exit mobile version