హుజూరాబాద్ ఉపఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ని ఓడించడానికి అధికార టిఆర్‌ఎస్ ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తుందో చెప్పాల్సిన పని లేదు. రాజకీయంగా అన్నిరకాలుగా దెబ్బకొట్టేందుకు టిఆర్‌ఎస్ చూస్తుంది. ఓ వైపు టిఆర్‌ఎస్ నాయకులు మొత్తం హుజూరాబాద్‌లో మకాం వేసి కారు గుర్తుపై ఓటు వేయాలని తిరుగుతున్నారు. మరోవైపు సిఎం కేసిఆర్…హుజూరాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించి…సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వేల కోట్లు కేటాయిస్తున్నారు. అలాగే ఇతర పార్టీలకు చెందిన బలమైన నాయకులని తమవైపుకు తిప్పుకుంటున్నారు.
అటు మంత్రి హరీష్ రావు…తన రాజకీయ చతురతని ప్రదర్శిస్తూ…హుజూరాబాద్‌లో ఈటలకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. గల్లీ గల్లీ తిరుగుతూ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. అలాగే కోట్లు ఖర్చు పెడుతూ, ప్రజలని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రచారానికి పార్టీ నిధులు వాడుతున్నారో లేక ప్రభుత్వ నిధులు వాడుతున్నారో తెలియదుగానీ, ప్రచారానికి మాత్రం భారీగా ఖర్చు పెడుతున్నారు. ఒక చిన్న సభ పెట్టిన లక్షల్లోనే ఖర్చు అవుతుంది.
అయితే ఇలా టిఆర్‌ఎస్ చేస్తున్నట్లు బిజేపి చేయడం లేదు. ఈటలకు పెద్దగా సపోర్ట్ ఇస్తున్నట్లు కనిపించడం లేదు. అగ్రనాయకులు రాష్ట్ర రాజకీయాలపైనే ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. ఏదో ఇద్దరు, ముగ్గురు నాయకులు మాత్రమే హుజూరాబాద్‌లో ఈటల కోసం పనిచేస్తున్నారు. అంటే ఈటల అన్నీ తానై చూసుకుంటున్నారు. అలాగే బిజేపి కూడా ఎన్నికల ప్రచారానికి ఇంతవరకు నిధులు కూడా ఇవ్వలేదని తెలుస్తోంది.
ఎన్నికల ప్రచారానికి అయ్యే ఖర్చు మొత్తం ఈటలనే చూసుకుంటున్నారని సమాచారం. మొత్తం భారమంతా ఈటలపైనే పడినట్లు కనబడుతోంది. పార్టీ ఫండ్స్ కూడా ఈటలకు అందలేదని తెలుస్తోంది. మరి ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ఏమన్నా నిధులు వస్తాయేమో చూడాలి. మొత్తానికైతే హుజూరాబాద్‌లో ఈటల ఒంటరి పోరాటం చేస్తున్నారని తెలుస్తోంది.