బీఆర్ఎస్‌ సంఘాలు.. ఫస్ట్ టార్గెట్ అదే..!

-

ఎట్టకేలకు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు మరికొన్ని గంటల్లో ప్రకటించనున్నారు. ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చనున్నారు. ఈ దసరా రోజున కేసీఆర్ నోట నుంచి టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుందని ప్రకటన రాబోతుంది. అయితే ప్రకటన వస్తే జాతీయ పార్టీ అయిపోదు. టీఆర్ఎస్‌ని బీఆర్ఎస్‌గా మార్చిన తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు తీసుకెళ్లాలి. అలాగే ఆ తీర్మానాన్ని ఎన్నికల సంఘం ఆమోదించాలి. అప్పుడే జాతీయ పార్టీగా మారుతుంది.

అయితే అక్టోబర్ 6న టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్గా మారుస్తూ చేసిన తీర్మానాన్ని పార్టీ సీనియర్‌ నేత బి. వినోద్‌కుమార్‌ బృందం ఢిల్లీకి తీసుకెళ్లనుంది. ఈసీఐ దీనిని పరిశీలించి ఆమోదం తెలపగానే బీఆర్‌ఎస్‌ ప్రస్థానం మొదలవుతుంది. ఇదిలా ఉంటే జాతీయ పార్టీగా మారిన అనంతరం అఖిల భారత స్థాయిలో కొన్ని అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. అంటే రైతులు, కార్మికులు, మహిళలు, యూత్ వింగ్‌లని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది.

ఇందులో భాగంగా మొదట కిసాన్‌ సంఘ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అనేకమంది రైతు సంఘాల ప్రతినిధులతో కేసీఆర్‌ చర్చలు జరిపారు. దీంతో వారిని భాగస్వాములుగా చేసి కిసాన్ సంఘ్ ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో రైతులకు అమలు అవుతున్న పథకాలని దేశ స్థాయిలో ప్రచారం చేయనున్నారు. ఇక రైతుల తర్వాత కార్మికులు, నిరుద్యోగ యువత లక్ష్యంగా సంఘాలు ఏర్పాటు కానున్నాయి.

ఇలా పూర్తి స్థాయిలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో డైరక్ట్ బీఆర్ఎస్ పోటీ చేసేలా..మరికొన్ని చోట్ల బీజేపీ వ్యతిరేక పార్టీలతో పొత్తు పెట్టుకుంటారని తెలుస్తోంది. ఇక దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్‌లో చేరికలు జరిగేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇక కేసీఆర్ జాతీయ పార్టీ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version