గన్నవరంలో వైసీపీ పంచాయితీ క్లైమాక్స్‌కు వచ్చింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావుల మధ్య పోరు తుది దశకు వచ్చింది. వంశీకి వైసీపీ సీటు ఖాయం కావడంతో..వైసీపీలో ఉన్న యార్లగడ్డ ఫైనల్ గా తన అనుచరులతో భేటీ అయ్యారు. ఇక తడి గుడ్డతో తన గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేసిన యార్లగడ్డ ఫైనల్ గా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా? లేక టిడిపిలోకి వెళ్ళి పోటీ చేయాలా? అనే అంశంపై చర్చలు జరుపుతున్నారు.
గత ఎన్నికల్లో వంశీ టిడిపి నుంచి గెలిచి వైసీపీలోకి రావడంతో యార్లగడ్డకు వైసీపీలో ప్రాధాన్యత లేదు. మధ్యలో కేడిసిసి బ్యాంకు ఛైర్మన్ పదవి ఇచ్చి మళ్ళీ తీసేశారు. ఇక గన్నవరం వైసీపీ సీటు వంశీకి ఫిక్స్ చేశారు. దీంతో యార్లగడ్డ తాజాగా తన అనుచరులతో సమావేశమై..వంశీ వల్ల అసలైన వైసీపీ కార్యకర్తలకు న్యాయం జరగలేదని వాపోయారు. తనకు సీటు ఇవ్వాలని జగన్‌ని కోరారు. కానీ తాజాగా విజయవాడకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి..యార్లగడ్డ పార్టీ మారితే నష్టమేమీ లేదని, ఆయన పార్టీ మారతారో లేదో ఆయన ఇష్టమని తేల్చి చెప్పేశారు.
ఈ క్రమంలో యార్లగడ్డ తాజాగా స్పందిస్తూ.. తాను టికెట్ కావాలని అడిగితే పార్టీ పెద్దలకు ఏం అర్థం అయిందో తెలియటం లేదని,వైఎస్ ఉంటే తనకు ఇలా జరిగేది కాదని, తడిగుడ్డతో గొంతు కోశారని వాపోయారు. దీంతో యార్లగడ్డ వైసీపీని వీడటం ఖాయమైంది. అలాగే చంద్రబాబుని కలుస్తానని, అపాయింట్మెంట్ అడిగానని యార్లగడ్డ చెప్పుకొచ్చారు. దీంతో యార్లగడ్డ టిడిపిలో చేరడం ఖాయమైంది.
మరో రెండు రోజుల్లో గన్నవరంలో లోకేష్ పాదయాత్ర ఉంది. భారీ సభ ఉంది. అప్పుడు యార్లగడ్డ టిడిపిలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఎలాగో గన్నవరం టిడిపి సీటు ఖాళీగా ఉంది. యార్లగడ్డ చేరితే…ఆయనకే సీటు. పైగా వంశీకి సరైన ప్రత్యర్ధి. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి ఉంది. ఇక వైసీపీ నుంచి వంశీ, టిడిపి నుంచి యార్లగడ్డ బరిలో దిగితే..గన్నవరం పోరు రసవత్తరం.