ఏపీలో సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశంపై నానా రచ్చ కొనసాగుతోంది. కొందరు ఈ ప్రతిపాదన మంచిదే అని సమర్థిస్తుంటే… మరికొందరు మాత్రం దీని వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అమరావతి రైతులు.. ప్రతిపక్ష నాయకులు ఈ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేఖిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కొందరు టీడీపీ నేతలు మాత్రం చంద్రబాబుకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే విశాఖను అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ చేయాలన్న సీఎం జగన్ ప్రతిపాదనను టీడీపీ నేత, మాజీమంత్రి కొండ్రు మురళి గట్టిగా సమర్థించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ జాబితాలో మరో మాజీమంత్రి కూడా చేరిపోయారు. ఎవరు ఏమనుకున్నా విశాఖ రాజధాని కావడమే సరైన నిర్ణయమని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అన్నారు. విశాఖ రాజధాని కావాలని తాను ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ కు విశాఖకు వందశాతం అర్హత ఉందని ఆయన అన్నారు. విశాఖతో ఉన్న అనుబంధం కారణంగా జగన్ ప్రతిపాదనను స్వాగతించామని తెలిపారు. టీడీపీ అధిష్టానం అభిప్రాయానికి వ్యతిరేకంగా రాజధాని విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని గంటా మరోసారి సమర్ధించారు.