జానారెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో చెరగని ముద్ర ఆయనది. ముఖ్యంగా నల్లగొండ రాజకీయాలను తన కనుసైగలతో శాసించిన దిగ్గజం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే కాంగ్రెస్ లో ఆయనది తిరుగులేని పెత్తనం. తెలంగాణ రాజకీయాల్లో ఏం జరిగినా ఆయన ప్రమేయం ఉండేది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే ఆయనకు అత్యధిక ప్రాముఖ్యత ఉండేది. అలాంటి వ్యక్తికి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది.
జానారెడ్డి 20ఏళ్లప్పటి నుంచే రాజకీయాల్లో ఉన్నారు. ఏకంగా 11సార్లు ఎమ్మెల్యేగా పోటీచేశారంటే.. ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకటి, రెండు సార్లకంటే ఎక్కువ టికెట్ దొరకని రాజకీయాల్లో.. అన్ని సార్లు టికెట్ తెచ్చుకున్నారంటే.. అది ఆయన చెరిష్మా అని చెప్పాలి. ఇక తెలంగాణ ఏర్పడటంలో కూడా ఆయన ప్రత్యేక పాత్ర పోషించారు. సోనియా గాంధీని పలుమార్లు కలిసి మరీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారు.
రాజకీయంగా ఆయనంటే అందరికీ ఇష్టమే. ఎన్నోసార్లు సీఎం కేసీఆర్ కూడా జానారెడ్డి అంటే తనకు ప్రత్యేక అభిమానమని చెప్పారు. అంతాలా ప్రత్యర్థులను కూడా తనవైపు తిప్పుకునేవారు జానారెడ్డి. అలాంటి వ్యక్తికి గతకొంత కాలంగా చేదు కాలం నడుస్తుంది. వయస్సు మీద పడటం ఒకటైతే.. 2018 ఎన్నికల్లో సిట్టింగ్ స్థానంలో ఓడిపోవడం మరొకటి. ఇక అనూహ్యంగా నోముల నర్సింహ్మయ్య మృతితో వచ్చిన ఉప ఎన్నిక ఆయనకు కలిసి వస్తుందని అనుకున్నారు. ఆయనే కాదు అంతా అదే అనుకున్నారు. ఎందుకంటే సాగర్ ప్రజల్లో ఆయనకు ఎనలేని ప్రేమ ఉంది. అలాంటి వ్యక్తిని విమర్శించడానికి కూడా ప్రత్యర్థుల ఒకింత ఆలోచిస్తారు.
ఇలాంటి తరుణంలో ఆయన గెలుస్తారని అంతా భావించారు. కానీ ఫలితాల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్ విజయం సాధించారు. దీంతో మరోసారి దెబ్బతిన్న ఆయన.. ఇక రాజకీయాలకు సెలవు చెప్పారు. ఇకపై యాక్టివ్ రాజకీయాల్లో ఉండబోనని, విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించారు. అయితే తన రాజకీయ వారసుడిగా తన కొడుకును పోటీ చేయించడం కాంగ్రెస్ ఇష్టమని తెలిపారు. ఏది ఏమైనా.. ఓ దిగ్గజం యాక్టివ్ రాజకీయాల నుంచి తప్పుకోవడం ఒకింత బాధాకరమే.