తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార బీఆర్ఎస్ పార్టీని అటు కాంగ్రెస్, ఇటు బిజేపి పార్టీలు గట్టిగా టార్గెట్ చేస్తున్నాయి. ప్రజా సమస్యలపై నిలదీయడమే కాదు..తమదైన శైలిలో రాజకీయం చేస్తూ కేసిఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ముందుకెళుతున్నారు. ఇదే సమయంలో బిఆర్‌ఎస్ నేతలు సైతం ఈటల, రేవంత్ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. తాజాగా వారిద్దరు టార్గెట్ గానే బిఆర్‌ఎస్ రాజకీయం నడుస్తోంది.తాజాగా బడ్జెట్ సమావేశాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో బిజేపి తరుపున ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ తనదైన శైలిలో ప్రశ్నలు సంధిస్తూ బిఆర్‌ఎస్‌ని ఇరుకున పెట్టడానికి చూస్తున్నారు. బడ్జెట్ లో కేటాయింపులు, పథకాల అమలులో ఉన్న లొసుగులపై ఈటల గళం ఎత్తారు.
కానీ ఆయనని ఎక్కడకక్కడ కట్టడి చేయడానికి బిఆర్‌ఎస్ నేతలు కష్టపడుతున్నారు. తాజాగా అసెంబ్లీలో ఆయన ఏదైనా అంశంపై ప్రశ్నిస్తుంటే చాలు..వెంటనే బిఆర్‌ఎస్ మంత్రులు లేచి కౌంటర్లు ఇస్తున్నారు. అంటే ఈటల ఒక మాట మాట్లాడితే..వెంటనే మంత్రులు లేచి కౌంటర్ చేయడానికి చూస్తున్నారు.అంటే ఈటలని మాట్లాడనివ్వకుండా చేయడానికి బిఆర్‌ఎస్ మంత్రులు ఎంత కష్టపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఆయన వాయిస్ పూర్తి స్థాయిలో వెళ్లనివ్వకుండా అడ్డుకునేందుకు కష్టపడుతున్నారు. అదే సమయంలో పాదయాత్రలో ఉన్న టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి…తనదైన శైలిలో కేసిఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ముందుకెళుతున్నారు. అదే సమయంలో పేదలకు ఉపయోగపడని ప్రగతి భవన్‌ని నక్సలైట్లు పేల్చేసిన తప్పు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో రేవంత్‌పై బిఆర్‌ఎస్ నేతలు వరుసపెట్టి విరుచుకుపడుతున్నారు. అలాగే ఆయనపై కేసులు పెడుతున్నారు. ఆయన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే తాను అదే మాట మీద ఉంటానని రేవంత్ అంటున్నారు. ప్రగతి భవన్‌ను పేల్చివేయాలని తాను చేసిన వ్యాఖలకు కట్టుబడి ఉన్నానని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రగతి భవన్ పార్టీ ఫిరాయింపుల అడ్డాగా మారిందని ఫైర్ అయ్యారు. మొత్తానికి అటు ఈటల, ఇటు రేవంత్..గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తున్నారు.