హుజురాబాద్ ఉప ఎన్నికల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రౌండ్‌లో బీజేపీకి 4610 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌కు 4444 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 119 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కొనసాగుతున్నారు. అయితే, టీఆర్‌ఎస్‌కు మరోసారి రోటీ మేకర్, రోడ్ రోలర్ షాక్ ఇవ్వనున్నట్లు కనిపిస్తున్నది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మొదటి రౌండ్‌లో సాధించిన మెజార్టీ కంటే కారును పోలి ఉన్న రోటీ మేకర్‌కు ఎక్కువగా ఓట్లు పోలవడం గమనార్హం. మొదటి రౌండ్‌లో బీజేపీ మెజార్టీ 119 ఓట్లు కాగా, రోటీ మేకర్‌కు 122 ఓట్లు వచ్చాయి. మరోవైపు ఇంచుమించు కారును పోలి ఉన్న మరో గుర్తు రోడ్ రోలర్‌కు 22 ఓట్ల వచ్చాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే టీఆర్‌ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది.
బీజేపీకి వజ్రం గుర్తు షాక్
మరోవైపు బీజేపీకి వజ్రం గుర్తు షాక్ ఇచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. వజ్రం గుర్తు కూడా ఇంచుమించు కమలం గుర్తును పోలి ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురైనట్లు తెలుస్తున్నది. మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి వజ్రం గుర్తుకు 113 ఓట్లు వచ్చాయి. దీనివల్ల బీజేపీకి ఎంతో కొంత నష్టం వాటిల్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.