ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి కేంద్రం త్వరలో గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానాలకు గానూ ముఖ్యమంత్రి వైఎస్ అభ్యర్ధులను ఖరారు చేసారు. రాజ్యసభకు… మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమల్ నత్వాని, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి పేర్లను ఖరారు చేసింది. ఇందులో ప్రధానంగా చెప్పుకునేది పరిమల్ నత్వాని పేరు.
ఆయన కోసం ముఖేష్ అంబాని ప్రత్యేక విమానంలో వచ్చి మరీ జగన్ ని కలిసారు. రాజ్యసభ సీటు కోసమే అంబాని వచ్చారని మీడియా కూడా రాసింది. అంతక ముందు జగన్ ఢిల్లీ వెళ్లి హోం మంత్రి, ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులను కలిసారు. ఈ సందర్భంగా జగన్… ముందు అమిత్ షా ఈ ప్రతిపాదన ఉంచినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత అంబాని రావడం, ఆయనతో పాటుగా నత్వాని రావడం అన్నీ జరిగిపోయాయి.
ఇక ఇప్పుడు నత్వానిని రాజ్యసభకు ఎంపిక చేయడంతో కేంద్ర పెద్దలు జగన్ కి గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. త్వరలోనే జగన్ మండలి నిర్ణయానికి కేంద్రం ఒకే చెప్పేస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం వెల్లడించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ బడ్జెట్ సెషన్ లోనే బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
రాజధాని బిల్లుని విపక్ష తెలుగుదేశం పార్టీ అడ్డుకున్న నేపధ్యంలో మండలిని రద్దు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకుని దాన్ని కేంద్ర హోం శాఖకు పంపించారు. ఇప్పుడు ఈ బిల్లు కేంద్రం పరిధిలో ఉంది. చెప్పిన వారికి రాజ్యసభ ఇవ్వడంతో జగన్ చెప్పింది కూడా తాము చెయ్యాలని కేంద్రం భావిస్తుంది. ఈ బడ్జెట్ సెషన్ లో దీన్ని ప్రవేశ పెట్టడం ఖాయమని అంటున్నాయి కేంద్ర ప్రభుత్వాలు కూడా.