రాష్ట్రానికి నేను తప్ప మరొకరు దిక్కులేదు.. అని అధికారంలో ఉన్న సమయంలో పదే పదే చెప్పుకొన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు ఆ మాటను నిజం చేసే క్రమంలో అధికార పార్టీపై తీవ్రస్థాయిలో యుద్ధం చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్న వారిని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని, రౌడీ మామూళ్లు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని, వారి ఆగడాలు పెరుగుతున్నందునే పరిశ్రమలు రావడం లేదని, వచ్చినా ఎప్పుడెప్పుడు పక్కరాష్ట్రాలకు వెళ్లిపోదామా? అని ఎదురు చూస్తున్నాయని బాబు గారు తెగ ఫీలవుతున్నారు.
ఓకే! ఇలానే కొంచెం సేపు అనుకుందాం.. కానీ, వెళ్లిపోయిన వాటి లిస్టు.. రెండు నుంచి మూడు వరకు ఉం టుంది. వీటిలో సింగపూర్ కన్సార్టియం, లులూ గ్రూపు, ఆదాని డేటా సెంటర్. వీటి గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంతగా బాబుగారి పేరు పోకుండా ఉంటుందని అంటున్నారు నిపుణులు. కన్సార్టియం సింగపూర్‌తో చంద్రబాబు చేసుకున్న ఒప్పందాలపై కేంద్రమే ఒద్దని అందట. అంతేకాదు, సుప్రీం కోర్టు కూడా ఇలాంటి ఒప్పందాలు దేశానికి మంచివి కాదని పేర్కొన్నదట.
ఇక, సింగపూర్ కు వాటాలు ఎక్కువగా ఇచ్చి, అమరావతిలో ఆధిపత్యాన్ని ఇచ్చే ఉద్దేశం కూడా ఈ ఒప్పందంలోనే ఉందని ప్రస్తుత ప్రభుత్వం బట్టబయలు చేసింది. దీంతో ఆ కంపెనీ దూకుడుకు కళ్లెం వేసేందుకు జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నంతో తాము స్వయంగా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని సింగపూర్ మంత్రి, చంద్రబాబు ఫ్రెండ్ శంకరన్ వెల్లడించారు. ఇక, దావోస్ వేదికగా చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో సాధించిందని, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేందుకు రెడీగా ఉన్నారని అప్పట్లో టీడీపీ ఊదరగొట్టేది.
అదే సమయంలో ప్రతి జనవరిలోనూ విశాఖ వేదికగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టుబడుల సదస్సు నిర్వహించేది. దీంతో ఈ వేదిక ద్వారా ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని బాబు అండ్‌కో ప్రచారం చేసేది. కానీ, ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా వచ్చిన దాఖలాలేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఈ అంశాలను ఎక్కడ కడిగేస్తుందో, ఎక్కడ పరువు తీస్తుందోనని భావించిన చంద్రబాబు ఎదురు దాడికి సిద్ధమయ్యారని అంటున్నారు నిపుణులు. సో.. మొత్తానికి బాబు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. బాగానే ఎదురుదాడి చేస్తున్నారన్నమాట..!