ఎవరికి వారే యమునా తీరే! అన్నట్టుగా ఉన్న ప్రకాశం జిల్లా టీడీపీ నేతల మధ్య ఇప్పటికైనా సఖ్యత ఏర్ప డుతుందా? ఎవరికి వారు మాకెందుకులే.. అని పక్కన పెడుతున్న పార్టీలో ఇప్పుడు ఐక్యతారాగం వినిపి స్తుందా? ఇప్పుడు అందరికీ ఎదురవుతున్న ప్రశ్నలు ఇవే. దీనికి కారణం.. ప్రకాశం జిల్లాలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారడమే. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు.. జగన్ ప్రభుత్వంపై ప్రభుత్వం యుద్ధం లో భాగంగా ప్రజా చైతన్యయాత్రలను బుధవారం నుంచి ప్రారంభించారు. అది కూడా ప్రకాశం జిల్లా నుంచే కావడంతో ఈ జిల్లాలో నాయకులను ఒకే తాటిపైకి తెస్తారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
జిల్లాలో పార్టీ పరిస్థితిని పరిశీలిస్తే కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా నాయకత్వం పనిచేయటం లేదనేది తేటతెల్లమవుతోంది. ప్రధానంగా నాయకుల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నలుగురు ఎమ్మెల్యేలు జిల్లాలో టీడీపీకి ఉండటం పెద్ద ఆయుధం. దానికితోడు రెండు మూడు నియోజకవ ర్గాల్లో ఇన్ఛార్జ్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటమే గాక అధికారపార్టీ వేధింపులకు వ్యతిరేకం గా పోరాడుతున్నారు. కానీ వీరందరినీ సమన్వయం చేసుకుంటూ జిల్లాస్థాయిలో పార్టీని ముందుకు నడిపేందుకు కనీస ప్రయత్నం జరగటం లేదు.
ఎవరి ఇబ్బందులు వారికి ఉండవచ్చు. కానీ ఇబ్బందుల్లో పార్టీకోసం సమయాన్ని కేటాయించే వారికే ప్రాధాన్యత ఇచ్చి ముందుకు నడపాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు వారి వారి నియోజకవర్గాలలో ప్రజాసేవ, పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ముందుంటున్నారు. అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్‌ని ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బతీసేందుకు విఫలయత్నం చేస్తున్నా ధైర్యంగా టీడీపీ వైపు ఉన్నారు. తాజాగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆర్థిక మూలాలను కూడా దెబ్బతీసే ప్రయత్నం అధికారపార్టీ చేస్తోంది.
ఇక పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుని అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం చేశారు. కొండపి ఎమ్మెల్యే స్వామిని బెదిరించి సైలెంట్ చేయాలని చూశారు. చీరాలలో బలరాంకు మద్దతుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతను వైసీపీలో చేర్చుకున్నారు. అయితే నలుగురు ఎమ్మెల్యేలు దేనికీ జంకకుండా ప్రజలతో కలిసి పార్టీకోసం పనిచేయటం ప్రారంభించారు. కానీ, వీరంతా ఎవరికి వారుగానే ముందుకు సాగుతున్నారు ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలోను, చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొనే విషయంలోను వెనుకడుగు వేస్తున్నారు. మరి ఇప్పడైనా బాబు వీరికి ధైర్యం చెప్పి.. ఏకతాటిపై నడిపిస్తారో లేదో చూడాలి.