రాజకీయాల్లో ప్రత్యర్థులు ఒక్కటైతే.. ఏం జరుగుతుందో.. అదే జరుగుతోందని అంటున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం ప్రజలు. ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ జనసేన. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నుంచి గెలిచిన ఏకైక నియోజకవర్గం కూడా రాజేలే. అయితే, ఇక్కడ నుంచి గెలిచిన జనసేన నేత రాపాక వరప్రసాద్ ఆదిలో కొంత దూకుడు ప్రదర్శించారు. జనసేన తరఫున తాను సత్తా చూపిస్తానని అనుకున్నారు. అయితే, పోలీసుల నుంచి ఎదురైన తొలి పరాభవం, కేసులతో ఆయన వెంటనే యూటర్న్ తీసుకున్నారు. నిజానికి ఆ సమయంలోఆయనకు పార్టీ అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు.
పోలీసులు తన పార్టీ ఎమ్మెల్యేపై కేసులు పెట్టడాన్ని, ఓ ఎస్సై.. తన పార్టీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇవ్వడా న్ని కూడా పవన్ సహించలేక పోయారు. దీంతో ఆయన పెద్దగానే స్పందించారు. అయితే, అది సర్దు మ ణిగిపోయినా.. తర్వాత మాత్రం రాపాక యూటర్న్ తీసుకున్నారు. పార్టీ మారకుండానే ఆయన వైసీపీకి సానుభూతి పరుడిగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నాయకుడు బొంతు రాజేశ్వరరావుతోను, పార్టీ ఇంచార్జ్ అమ్మాజీతోనే సఖ్యతగా ముందుకు సాగుతున్నారు. బొంతును పక్కన పెట్టిన జగన్ అమ్మాజీకి నియోజకవర్గ పగ్గాలు ఇవ్వడంతోవీరి మధ్య ప్రారంభంలో సఖ్యత లేదు. ఇకిప్పుడు వీరిద్దరు కూడా కలిసిపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ ముగ్గురూ ఒకే తానుగా మారిపోయి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు.
ఏదైనా కాంట్రాక్ట్ పనులు ఉంటే అమ్మాజీ, రాపాక వర్గాలు పంచుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇటీవల స్థానిక ఎన్నికల సమయంలోనూ రాపాక, బొంతు, అమ్మాజీ వర్గాలు ఒక్కటే అయిపోయి.. సీట్లను పంచేసుకున్నాయి. వైసీపీ టికెట్లు పంచడంలోనూ రాపాక కీలక భూమిక పోషించారు. నిజానికి అధికార పార్టీ నేతలపై ఒకవైపు పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటే.. అటు అసెంబ్లీలోను ఇటు బయట కూడా రాపాక ప్రసంశల జల్లు కురిపించారు. నియోజకవర్గంలోనూ పనులు పంచుకుంటూ.. దొరికింది జేబులో వేసుకుంటున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే, ప్రస్తుతానికి ఈ రాజకీయాలు బాగానే ఉన్నప్పటికీ..మున్ముందు మాత్రం రాపాకకు మంచిది కాదని సూచిస్తున్నారు. మరి రాపాక వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.